తెర మీదకు గాంధీజీ మనవడి పేరు..
న్యూఢిల్లీ: జూలైలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా జేడీయూ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ పేర్లు చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తాజగా గాంధీజీ వారసుడిని తెరమీదకు తెచ్చే యత్నం చేస్తోంది. (గాంధీజీ కుమారుడు దేవేంద్ర కొడుకే గోపాల్‌కృష్ణ గాంధీ. ఐఏఎస్ అధికారి అయిన ఆయన 1992లో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.)
గోపాల్‌కృష్ణ గాంధీ అభ్యర్థిత్వంపై పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ మాట్లాడుతూ... ఈ విషయంపై తాను ఇప్పుడే మాట్లాడలేననని, దీనిపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి... ఈ అంశంపై గోపాల్‌కృష్ణ గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా ఉంది. అలాగే మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థికి పోటీగా ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కసరత్తును భుజానికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫు అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసేందుకు ఇతర పార్టీలు సుముఖంగా లేవు. ఇక పాలకపక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రధానంగా వినిపిస్తోంది.