‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ 400 కారును దాని యజమాని గార్బేజ్ బాక్స్ (చెత్త డబ్బా)గా మార్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా.. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
మహీంద్రా సంస్థ ఈ ఏడాది జనవరిలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ మహీంద్రా ఎక్స్‌యూవీ 400ని విడుదల చేసింది. ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి మహీంద్రా సంస్థ అన్నా, ఆ కంపెనీ అమ్మే కార్లన్నా మహా ఇష్టం. అందుకే ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు విడుదలైందో లేదో వెంటనే కొనేశాడు.
అయితే, తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కారు విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. మహీంద్రా కంపెనీ కారు రేంజ్ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ ఎక్స్‌యూవీ 400ను ఘజియాబాద్ మహీంద్రా కారు షోరూం ఎదుట కారుకు ఓ ఫ్లెక్సీ కట్టి చెత్తడబ్బాగా మార్చాడు.
ఈ సందర్భంగా, ‘ఎలక్ట్రిక్ XUV400ను కొనుగోలు చేయడం మీ సొంత ఇంటిని మీరు తగటబెట్టుకున్నట్లే. ఇంట్లో కారుకి ఛార్జింగ్ పెట్టాలంటే కస్టమర్ల ఇంట్లో 10 kW కనెక్షన్ అవసరం. ఆసక్తి ఉన్నవారు బయట ఛార్జ్ పెట్టుకోవాలంటే రూ. 1,000 ఖర్చవుతుంది.
ఈ ధర వేరియంట్లో కారు రేంజ్ కేవలం 150 కిలోమీటర్లే. కంపెనీ మాత్రం కారు రేంజ్ 300 నుండి 350 కిలోమీటర్ల ఉంటుందని ప్రచారం చేసుకుంటుంది. మహీంద్రా కారు డీలర్ సంస్థ శివ మహీంద్రా సిగ్గుపడాలి’ అంటూ పోస్టర్‌పై రాశారు. అంతేకాదు దేశీయ మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ కారును కొనుగోలు చేయొద్దని వాహనదారుల్ని కోరుతున్నాడు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఎక్స్‌యూవీ400కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. సదరు వాహన యజమాని మంచి పనిచేస్తున్నారని మద్దతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం కారును సరైన పద్దతిలో వినియోగించాలని సూచిస్తున్నారు.
చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి?