mahua spirit
-
దేశీ మద్యం గుబాళింపులు
ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.టోంగ్బా.. జుడియా సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్మాయ్ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్ బార్ట్రెండర్గా ఇన్‌స్టాలో ఫేమస్ అయిన కాక్టేల్ నిపుణుడు నితిన్ తివారీ చెప్పారు. దేశవ్యాప్తంగా మారిన టేస్ట్శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్బార్స్ ఇండియా, ఇండియా బార్టెండర్ వీక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్ మిడ్నైడ్ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్టేల్ నిపుణుడు అమీ ష్రాఫ్ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్ వైన్ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ విక్రమ్ దామోదరన్ అన్నారు. విలాస వస్తువుగా..‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్. తర్వాత మరుగున పడింది. ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్టేల్ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్ బ్రదర్స్ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపీ చినోయ్ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్ బ్రాండ్ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
బాటిళ్లలో ‘మహువా’ అమ్మకాలు
న్యూఢిల్లీ: సంప్రదాయ గిరిజన పానీయం ‘మహువా’ను బాటిళ్లలో నింపి మార్కెటింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వన్‌ధన్ కార్యక్రమం కింద గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య ట్రైఫెడ్తో అవగాహనా ఒప్పందం కుదర్చుకుందని అధికారులు తెలిపారు. అయితే మహువాలో ఆల్కహాల్ పాళ్లు ఉన్నందున దాని అమ్మకానికి ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. బాటిళ్లలో నింపే సమయంలోనే ఈ పానీయానికి అల్లం, వాము కలిపితే మరింత రుచికరంగా మారుతుందని ట్రైఫెడ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గిరిజనుల ఏ వేడుకలోనైనా సేవించే ఈ పానీయాన్ని మహువా పువ్వుల నుంచే తయారుచేస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గరిజన ప్రాంతాల నుంచి ఈ ఉత్పత్తిని సేకరిస్తారు. గిరిజనుల ఇతర ఉత్పత్తులైన చింతపండు, ఉసిరిని కూడా జామ్ రూపంలో మార్కెటింగ్ చేయాలని కూడా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
ఇప్పసారా... తెలంగాణ టకీలా!
- సహజ సిద్ధ మత్తు పానీయంపై దృష్టి సారించిన సర్కారు - మెక్సికో బ్రాండ్ ‘టకీలా’ తరహాలో ఇప్పసారాకు ఇమేజ్ పెంచే ఆలోచన - గోదావరి పరివాహక అడవుల్లో వందలాది ఎకరాల్లో విరివిగా ఇప్ప చెట్లు - కృత్రిమంగా చెట్ల పెంపకం, పూల సేకరణ, తయారీ విధానంపై అధ్యయనం సాక్షి, హైదరాబాద్: ప్రకృతి సహజ సిద్ధమైన ఇప్పపూలతో తయారుచేసే సారాను రాష్ట్రంలో ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మెక్సికో దేశానికి చెందిన ‘టకీలా’ పానీయం తరహాలో ‘ఇప్పసారా’కు కూడా బ్రాండ్ ఇమేజ్ తేవాలని యోచిస్తోంది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని అడవుల్లో వందలాది ఎకరాల్లో ఇప్పచెట్లు విరివిగా పెరుగుతాయి. ఇక్కడి గిరిజనులు వాటి పూలతో సారా తయారుచేసి.. వారు తాగడంతో పాటు విక్రయిస్తుంటారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని వినియోగం ఎక్కువ. అయితే సారాపై ప్రభుత్వ నిషేధం, అటవీశాఖ ఆంక్షల నేపథ్యంలో... ఇప్పసారా తయారుచేసే గిరిజన కుటుంబాలు తగ్గిపోయాయి. కానీ తాజాగా ఇప్పపూలను సేకరించి శుద్ధిచేసి, శాస్త్రీయంగా సారా తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సర్కారు మదిలో మెదిలింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం... రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇప్పచెట్లు ఉన్నాయి, ఇప్పసారాను శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసేందుకు గల అవకాశాలు, కృత్రిమంగా ఇప్పచెట్లను పెంచడం ద్వారా ఎన్ని రోజుల్లో పూలను సేకరించవచ్చనే విషయాలపై అధ్యయనం చేయాలని సూచించింది. ఉత్తర తెలంగాణ, ఖమ్మం అడవులతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పపూల సేకరణ చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో దేశీయ పానీయాల విక్రయాలపై కూడా సర్వే జరపాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. ‘మహువా’గా ప్రసిద్ధి ఇప్పచెట్టుగా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ చెట్ల శాస్త్రీయ నామం ‘మధుకా లింగిఫోలియా’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మహువా, మొహా, మధుకా, ఇల్లుప్పాయి, మదుర్గం వంటి పేర్లతో పిలుస్తారు. ఇప్ప కాయల నుంచి తీసిన నూనెను వైద్యానికి వినియోగిస్తారు. జామ్‌లు, ఇతర క్రీమ్‌ల తయారీలోనూ ఇప్ప కాయలను వినియోగిస్తారు. అయితే అడవుల్లోని గిరిజనులు ఈ చెట్టు పూలను సేకరించి సారా తయారుచేస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాచలం, ఏటూరు నాగారం డివిజన్లలోని గిరిజన తండాల్లో ఇప్పసారా వినియోగిస్తున్నారు. దీనిని తెలంగాణ బ్రాండ్ పానీయంగా మారిస్తే... ఇప్పపూల సేకరణ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. టకీలాతో సారూప్యం మెక్సికోలోని టకీలా నగరంలో నాలుగు శతాబ్దాల క్రితమే సహజ సిద్ధమైన మత్తు పానీయాన్ని గుర్తించారు. ‘బ్లూ అగేవ్’ అనే మొక్క నుంచి తయారుచేసే ఈ మత్తు పానీయానికి బాగా డిమాండ్ పెరగడంతో దానిని ఆ నగరం పేరు మీదే ‘టకీలా’గా ఖాయం చేశారు. ఇప్పుడిది మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభిస్తోంది. అదే తరహాలో ఇప్పసారాకు బ్రాండ్ ఇమేజ్ తేవాలనేది సర్కారు యోచన. మరో విశేషం ఏమిటంటే.. టకీలా, ఇప్పసారా రెండూ కూడా ఎలాంటి రంగు లేకుండా నీటిలా కనిపిస్తాయి. ఓ రిసార్టులో పరిశీలన హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్ట్ యాజమాన్యం ఇప్పచెట్లను ప్రయోగాత్మకంగా పెంచుతోంది. వేగంగా పెరిగే ఈ చెట్టు 20 మీటర్ల ఎత్తు ఎదుగుతుంది. కృత్రిమంగా చెట్లను పెంచాల్సి వస్తే ఏం చేయాలన్న అంశంపై ఎక్సైజ్‌శాఖ అధికారులు సదరు రిసార్ట్స్‌కు వెళ్లి ప్రాథమికంగా పరిశీలించినట్లు ఓ అధికారి తెలిపారు. అడవుల్లో పెరిగిన చెట్లతో పాటు కృత్రిమంగా చెట్లను పెంచడం వల్ల అయ్యే ఖర్చు, నిర్వహణ భారం, మార్కెట్ అవకాశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు.