Mains test
-
2011 గ్రూప్1 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 గ్రూప్1 పరీక్షల నోటిఫికేషన్‌కు సంబంధించిన తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం రాత్రి ప్రకటించింది. 152 పోస్టులకు పోటీపడిన 294 మంది అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను వెల్లడించింది. వీటితో పాటు మెయిన్స్ పరీక్షకు హాజరైన మొత్తం 2,691 మందికి సంబంధించి సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను, మొత్తం మార్కుల జాబితాలను కూడా తన వెబ్సైట్లో పొందుపరిచింది. 15 రకాల పోస్టులకు ఆయా అభ్యర్థుల రిజర్వేషన్ కేటగిరీ పోస్టు ప్రిఫరెన్స్ తదితరాలను అనుసరించి ఈ ఎంపిక జాబితాను వారం రోజుల్లో ప్రకటిస్తామని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. ఈ గ్రూప్1 ఇంటర్వ్యూల మార్కుల జాబితా లీక్‌పై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాయ నున్నామని చెప్పారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 152 పోస్టులకు 294 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరి మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను కమిషన్ మంగళవారం విడుదల చేసింది. 294 మందిలో దివ్యాంగుల కోటాలోని ఒక అభ్యర్థిని అనర్హుడిగా గుర్తించారు. నలుగురు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాలేదు. -
పరుగెత్తాల్సింది ఒక మైలే!
పోలీసు ఎంపిక పరీక్షలో కీలక మార్పులు సాక్షి, హైదరాబాద్: పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని స్థానంలో ఒక మైలు(1.6 కి.మీ.) పరుగును చేర్చనున్నారు. డీజీపీ జేవీ రాముడు మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంపిక ప్రక్రియలో మార్పుచేర్పులను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఎంపిక రాత పరీక్ష లోనూ మార్పులు చేయనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించి, తర్వాత దేశదారుఢ్య పరీక్షలతోపాటు ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని అధికారులు సూచించారు. పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టుల భర్తీతోపాటు వీరికిస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని డీజీపీ నిర్ణయించారు.