కన్నుల పండువగా టాంటెక్స్ మైత్రి సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. టచ్ నైన్ ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మైత్రి సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షత వహించారు. చిన్నారులు సహస్ర, వనం హర్షిత్ తదితరులు పాటలు, కవితలతో అలరించారు. ఇదే కార్యక్రమంలో నాన్న ప్రేమను తెలియజేస్తూ ప్రదర్శించిన ‘మా నాన్న’ షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లంతా తమను తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం మైత్రి బృంద సభ్యులు వనం జ్యోతి, చాగర్లమూడి శ్రీదేవి, బింగి సుమన “నేం బింగో”, "టాబూ" ఆటలు ఆడించడంతో కాసేపు అంతా చిన్నపిల్లలు అయిపోయారు. పంచె కట్టే పోటీ చాలా సరదాగా సాగి.. అందరినీ నవ్వించింది. ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాలకమండలి సభ్యుడు రొడ్డా రామకృష్ణ ఎన్నో తెలుగు పుస్తకాలు, నవలలను పంచిపెట్టారు. టాంటెక్స్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, మండిగ శ్రీ లక్ష్మి, పాలేటిలక్ష్మి, తోట పద్మశ్రీ, పార్నపల్లి ఉమామహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని, సభ్యుల కోరిక మేరకు జూలైలో మైత్రి సభ్యులకు కేరమ్స్, చెస్ పోటీలు నిర్వహిస్తామని సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి తెలిపారు.