ఎట్టకేలకు విడుదలైన మహమ్మద్: మెసెంజర్ ఆఫ్ గాడ్
అతి తక్కువ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించి అంతర్జాతీయ వేదికల మీద కూడా శభాష్ అనిపించుకున్న దర్శకుడు మజీద్ మజిదీ.. ఇరానియన్ దర్శకుడిగా అంతర్జాతీయ సినిమా అభిమానులకు పరిచయం అయిన మజిదీ ఎన్నో సామాజిక అంశాలను తెరకెక్కించారు. దర్శకుడిగా ఎన్నో అద్భుత విజయాలు సాదించిన మజిదీ, తన సినిమా విడుదల విషయంలో అదే స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మజిదీ డైరెక్షన్ లో 40 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' రిలీజ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో పాటు కొంతమంది విశ్లేషకుల అభ్యంతరాలతో వాయిదా పడింది.
గతంలో చిల్డ్రన్స్ ఆఫ్ హెవెన్, బరాన్, ద విల్లో ట్రీ లాంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన మజిదీ, ఆ సినిమాలతో పోలిస్తే సాంకేతికంగా కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు మజిదీ. ముఖ్యంగా విటోరియా స్టొరారో సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని మరింతగా పెంచింది. ఇక ఆస్కార్ వేదికపై మెరిసిన భారతీయ సంగీత దిగ్గజం రెహమాన్ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం మజిదీ దర్శకత్వంతో పోటీ పడ్డాయి. ఇదే కథాంశంతో 1977లో రిలీజైన 'ద మెసేజ్' కన్నా ఈ సినిమా మరింత ఉన్నతంగా తెరకెక్కింది. ఇలా ఎన్నో అద్భుతాలకు ఆతిథ్యం ఇచ్చిన 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' ఆగస్టు 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అన్ని రకాల వివాదాల నుంచి బయటకు వచ్చిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. వివాదాల సంగతి ఎలా ఉన్నా 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' ఎంతో నిజాయితీగా తీసిన చిత్రంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించిన మజిదీ మరోసారి ప్రపంచ సినీ అభిమానులకు తన మ్యాజిక్ ను పరిచయం చేశాడు.