యువకుడి దారుణహత్య
శామీర్‌పేట్: మండలంలోని మజీద్పూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. సీఐ సత్తయ్య కథనం ప్రకారం.. మజీద్‌పూర్ శివారులో మేడ్చల్-మజీద్‌పూర్ మార్గంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడిని ఐలయ్య (26)గా గుర్తించారు. అతడి తలకు తీవ్ర గాయాలు కనిపించడంతో ఎవరో చంపేసి ఉండొచ్చనే కోణంలో పరిశీలించారు. జాగిలాలు, క్లూస్ టీంను రప్పించి విచారణ చేశారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి మజీద్‌పూర్‌లోని మృతుడి సవతి తండ్రి గోపాల్, తల్లి సత్తమ్మ ఉంటున్న ఇంటి వద్దకు, అక్కడే ఉన్న ఓ రిక్షా వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో ఐలయ్యను సవతి తండ్రి గోపాల్ హత్య చేసి రిక్షాలో తీసుకువచ్చి రోడ్డు పక్కన పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు గోపాల్‌ను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన (బుడగ జంగాలు) గోపాల్‌కు భార్య చనిపోవడంతో మెదక్ ప్రాంతానికి చెందిన సత్తమ్మతో (ఈమె కుమారుడు ఐలయ్య)ను కలిసి ఐదేళ్లుగా మజీద్‌పూర్‌లోని ఓ వ్యక్తి వద్ద మూగజీవాలు కాస్తున్నాడు. గోపాల్ సత్తమ్మతోపాటు తన మొదటి భార్య కుమారుడు మహేశ్‌తో కలిసి ఉంటున్నాడు. సత్తమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఐలయ్య మంగళవారం రాత్రి మజీద్‌పూర్ గ్రామానికి వచ్చి తామ ఇంట్లో నిద్రపోయాడని, ఉదయం లేవగానే కన్పించలేదని తెలిపింది. మంగళవారం రాత్రి గోపాల్‌కు తన కుమారుడు ఐలయ్యకు మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగడంతో హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.