'నా ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలే'
‘మజ్ను’ విజయయాత్రలో హీరో నాని
రాజమహేంద్రవరం : తన ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలేనని, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్లే విజయాలు సొంత చేసుకుంటున్నానని సినీ హీరో నాని అన్నారు. ఆయన నటించిన ‘మజ్ను’ సినిమా విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... దిల్రాజు నిర్మిస్తున్న ‘ నేను లోకల్’ అనే సినిమాలో నటిస్తున్నానన్నారు. తన సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ విజయాల హీరో నానితో తాను నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకులు విరించి వర్మ మాట్లాడుతూ తన తొలిచిత్రం ఉయ్యాల జంపాల సమయంలో రాజమహేంద్రవరంతో అనుబంధం ఏర్పడిందన్నారు. అనంతరం చిత్ర యూనిట్ మజ్ను సినిమా ప్రదర్శింపబడుతున్న అనుశ్రీ, నాగదేవి థియేటర్లకు వెళ్లి సందడి చేసింది. కార్యక్రమంలో అనుశ్రీ థియేటర్ మేనేజర్ విష్ణు, సుంకర బుజ్జి పాల్గొన్నారు.