ఏప్రిల్ 25 వరకు నీరు విడుదల చేయాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మోదేపల్లి మేజర్ పమిడిపాడు బ్రాంచ్ కాలువ ద్వారా ఏప్రిల్ 25వ తేదీ వరకు పొలాలకు నీరు విడుదల చేసి ఆదుకోవాలని ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను శనివారం సాయంత్రం కలిసి విన్నవించుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన నూజెండ్ల, లక్ష్మీనగర్, సాయినగర్, గాంధీనగర్ గ్రామాల రైతులు, ప్రకాశం జిల్లాకు చెందిన వేముల, అగ్రహారం, వేములబండ, రమణారెడ్డిపాలెం, ఈదర గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో కలెక్టర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మోదేపల్లి మేజర్, పమిడిపాడు బ్రాంచ్ 19వ బ్లాక్ కాలువల ద్వారా తమకు సకాలంలో నీరు రాకపోవడంతో ఆలస్యంగా పంటలు సాగు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, మిరప పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయన్నారు. ఈ పంటల కోసం వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామన్నారు. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నందున నీటిని పొడిగించాలని కోరారు.
ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన పలు నీటి సంఘాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.