నాంపల్లి రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
పరుగులు పెట్టిన ప్రయాణికులు
‘మాక్‌డ్రిల్’ అని తెలిసి ఊపిరి పీల్చుకున్న వైనం
ప్రజల అవగాహన కోసమే: డీ సీపీ కమలాసన్‌రెడ్డి
నాంపల్లి: ప్రాంతం.. నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం.. సోమవారం సాయంత్రం 4 గంటలు కావొస్తుంది. స్టేషన్ మొత్తం ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ప్లాట్‌ఫాం-1 మీద ఓ టిఫిన్ బాక్స్‌ను గుర్తించారు. అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు 100 ఫోన్‌చేసి సమాచారం అందించారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు స్టేషన్‌కు చేరుకుని తనిఖీలు చేయగా బాక్స్‌లో బాంబు ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పాటు పక్కనే ఉన్న రైలు పట్టాలపై మరో టిఫిన్ బాక్స్‌ను కనుగొన్నారు. అందులోనూ బాంబును గుర్తించారు.
పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులు దూరంగా జరగాలని మైక్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో టిఫిన్ బాక్స్‌ను వదిలివెళ్లిన ప్లాట్‌ఫాం మీదకే లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ వస్తోంది. రైలు చేరుకోక ముందే ఓ టిఫిన్ బాక్స్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే పోలీసులు చొరవ తీసుకుని పట్టాలపై పడివున్న మరో టిఫిన్ బాక్స్‌లోని బాంబును నిర్వీర్యం చేశారు.
ఇదంతా నిజమే అనుకుంటున్నారా..? అంతా ఉత్తుత్తిదే. బాంబు పేలుళ్లపై రైలు ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి పోలీసులు సోమవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అనంతరం ప్రయాణికులకు బాంబు పేలుళ్లపై అవగాహన కల్పించారు. ఇందులో అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే చేయాల్సిన విధానాలను ప్రదర్శన ద్వారా ప్రయాణికులను చైతన్యం చేశారు. దక్షిణ మధ్య రైల్వే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు రైల్వే సీపీఆర్వో సాంబశివరావు, రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి, సీఎస్‌డబ్లూ, ఐఎస్‌డబ్లూ అడిషనల్ డీసీపీలు రామకృష్ణ, ప్రతాప్, ఆర్పీఎఫ్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పొర్టర్లు, హ్యాకర్ల ఫోన్ నంబర్ల సేకరణ
అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఫుట్‌పాత్ వ్యాపారులు, పోర్టర్స్, హాకర్స్, క్లీనింగ్ స్టాఫ్, పార్కింగ్ స్టాఫ్ ఫోన్ నంబర్లను సేకరిస్తున్నట్టు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సీపీఆర్వో సాంబశివరావు మాట్లాడుతూ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 106 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, 40 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. దీంతో పాటు సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేసేందుకు రూ.6.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో 41 సీసీ కెమెరాలను అమర్చామన్నారు.
బాంబు నిర్వీర్యానికి అధునాతన పరికరం
అనుమానాస్పద వస్తువులను పరిశీలించేందుకు నగర పోలీసు విభాగం సుమారు రూ.3 లక్షలతో టెలిస్కోపిక్ మానిపులేటర్ పరికరాన్ని కొనుగోలు చేసింది. దీని సహాయంతో అనుమానిత వస్తువులను తనిఖీ చేస్తున్నారు. సోమవారం నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన మాక్ డ్రిల్‌లో ఈ పరికరాన్ని సీఎస్‌డబ్లూ బీడీ టీమ్ ఇన్చార్జి ఆఫీసర్ నాగసాయి ఆధ్వర్యంలో వినియోగించారు.