ఎయిర్‌పోర్టు బాగుంది.. తాజ్‌మహల్‌కు వెళ్తున్నా
* కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్
* ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో తీరుతున్న కోరిక
శంషాబాద్: ‘మా ఫ్రెండ్స్ చెప్పే వాళ్లు.. విమానాశ్రయం, తాజ్‌మహల్ ఎంతో బాగుంటాయని. ఈ రోజు విమానాశ్రయం చూశా.. చాలా బాగుంది’ అని కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నెల్లిమలకు చెందిన ఎం.వెంకటేశ్వర్లు, కాంతమ్మ దంపతుల కుమారుడు గిరిధర్. 8వ తరగతి చదువుతున్నాడు.
ఏడాదిగా జ్వరంతో బాధపడుతున్న అతడిని తల్లిదండ్రులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చూపించారు. బాలుడికి కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో ఇటీవలే నగరంలోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ బాలుడి కోరికలను తెలుసుకుని వాటిని తీర్చడానికి ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తల్లిదండ్రులతో కలసి తాజ్‌మహల్ చూడడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గిరిధర్ మీడియాతో మాట్లాడారు.