భాషణం: Break a Leg
ఆంగ్ల రంగస్థల నటులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. స్టేజీ మీద వారు ‘మేక్బెత్’ అనే మాట వాడరు. ఒకవేళ ఆ నాటకం పేరు పలకవలసి వచ్చినా, ‘మేక్బెత్’కు బదులుగా ‘స్కాటిష్ ప్లే’ అంటారు. అదొక శాపపీడిత నాటకంగా ముద్రపడిపోడానికి కారణం మేక్‌బెత్‌ను ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శించినా ఏదో ఒక విషాదం జరుగుతుండడమే! అలాగే నాటకం ప్రారంభానికి ముందు (అది ఏ నాటకమైనా) కళాకారులు ఒకరికొకరు ‘గుడ్‌లక్’ చెప్పుకోరు. అలా చేస్తే చెడు జరుగుతుందని, విధికి సవాల్ విసిరినట్లవుతుందని వారు నమ్ముతారు. అందుకే ‘గుడ్‌లక్’కి బదులుగా Break a leg అని విష్ చేసుకుంటారు. ఏమిటి ఈ ‘బ్రేక్ ఎ లెగ్ ’?
జర్మన్ భాషలో hals und beinbruch అనే ఒక వ్యక్తీకరణ ఉంది. దానర్థం neck and leg break అని. ఆ ‘నెక్ అండ్ లెగ్ బ్రేక్’కి అర్థం ‘గుడ్ లక్’ అని. జర్మన్ భాష మాట్లాడేవారు, ఇడిష్ (జర్మనీ యూదులు మాట్లాడే ఒక భాష Yiddish) మాట్లాడే వారు 20వ శతాబ్దంలో అమెరికా వలస వచ్చినప్పుడు వారితోపాటు neck and leg break అనే మాట కూడా అమెరికన్లకు పరిచయమైంది. ఇలా వలస వచ్చినవాళ్లు ఎక్కువ మంది నటనారంగంలోని కళాకారులు, నిపుణులు కావడంతో క్రమంగా అది రంగస్థల పదబంధం అయింది.
సినిమాలంటే ఏమిటో తెలియని కాలంలోనే అంటే... 18 వ శతాబ్దంలో ఒక ఆచారం ఉండేది. కొన్ని ప్రత్యేక సన్నివేశాలలో రంగస్థల నటులెవరైనా తమ పాత్రకు జీవం పోస్తున్నప్పుడు ప్రేక్షకులు మంత్రముగ్ధులవడాన్ని గమనించి చటుక్కున పాత్రలోంచి కొన్ని క్షణాల పాటు నటన ఆపి, అలా నిలబడిపోయేవారు. కరతాళధ్వనులకు ఆ ఆర్టిస్ట్ ఇచ్చే స్పేస్ అది. అంతా అభినందించాక, వేదిక మీదే మిగతా నటులనుంచి కాస్త ముందుకు వచ్చి ప్రేక్షకులకు వినమ్రంగా అభివాదం చేసి తిరిగి తను సీన్లోకి వెళ్లిపోయేవారు. అభివాదం కూడా తలను కాస్త దించి, ఒక మోకాలిని కొద్దిగా వంచి చేసేవారు. అలా మోకాలును వంచడమే breaking the leg. అదే ఆ తర్వాత break a leg అయింది.