Makkal Mandram
-
నో మోర్ పాలిటిక్స్: కుండబద్దలు కొట్టిన రజినీ
-
‘ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలోకైనా వెళ్లండి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు రజనీకాంత్ రాజకీయాలపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో మక్కల్ మన్రం నేతలు వలసబాట పట్టారు. నచ్చిన పార్టీ దిశగా కదిలిపోతున్నారు. అలా వెళ్లిపోతున్న వారికి రజనీ మక్కల్ మన్రం రైట్..రైట్ చెప్పింది. వలసలకు అభ్యంతరం లేదు..అయితే ముందుగా మన్రానికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరండని సోమవారం విజ్ఞప్తి చేసింది. రాజకీయ ప్రవేశంపై రెండు దశాబ్దాలుగా ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ మూడేళ్ల క్రితం స్పందించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని 2017లో చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగారు. రజనీ ఆదేశాల మేరకు అభిమాన సంఘాలు.. మక్కల్ మన్రాలుగా మారిపోయాయి. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రజనీకాంత్ పార్టీ ఊసెత్తలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ స్థాపన పెద్ద చర్చనీయాంశం కావడంతో గత ఏడాది ఆఖరులో రజనీ మళ్లీ రంగప్రవేశం చేశారు. మక్కల్ మన్రం జిల్లా ఇన్‌చార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయసేకరణ చేశారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీ ప్రకటన, 2021 జనవరిలో పార్టీ స్థాపన, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ అంటూ ప్రకటించారు. ఈలోగా ‘అన్నాత్తే’ షూటింగ్ ముగించుకువస్తానని హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారినపడి గత నెల 29న చెన్నైకి చేరుకున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని, పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన అభిమానుల గుండెల్లో బాంబులా పేలింది. చెన్నై పోయస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టి వత్తిడి చేసినా, చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టినా రజనీకాంత్ చలించలేదు. ఇక చేసేదేమీ లేకపోవడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. వీరిలో నలుగురు ప్రముఖులు రెండురోజుల క్రితం డీఎంకేలో చేరిపోయారు. మిగిలిన వారు సైతం వేర్వేరు పారీ్టల వైపు చూస్తున్నారు. అలాగే వెళ్లిపోండి, అయితే.. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో రజనీ మక్కల్ మన్రం ప్రధాన సారధుల్లో ఒకరైన సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రజనీ మక్కల్ మన్రంలోని వారు ఏదైనా పారీ్టలోనైనా చేరవచ్చు. అయితే మన్రం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లండ’ని అందులో పేర్కొన్నారు. -
డీఎంకేలోకి తలైవా టీం .. చెప్పే వచ్చాం..
సాక్షి, చెన్నై: రజనీ మక్కల్ మండ్రంకు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు ఆదివారం డీఎంకేలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు. త్వరలో మరి కొందరు మక్కల్ మండ్రం నుంచి బయటకు రాబోతున్నట్టు ఈ కార్యదర్శులు ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ పెడతా రని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాలతో రాజకీయాలు లేవు, పార్టీ లేదు అని తలైవా ప్రకటించేశారు. ఇది ఆయన అభిమానులకే కాదు, రజనీ మక్కల్ మండ్రంలో సేవల్ని అందిస్తూ వచ్చిన వారికి పెద్ద షాక్కే. saఆయన్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు కొందరు పోరాటాల బాట పట్టినా తాను మాత్రం రానంటే రాను అని రజనీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రజనీతో రాజకీయపయనం సాగించాలన్న ఆశతో ఉన్న ఆయన అభిమాన సంఘం నేతలు , తలైవా నిర్ణయంతో ఇక తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. శు›క్రవారం కృష్ణగిరి రజనీ మక్కల్ మండ్రం కార్యదర్శి మది అలగన్ డీఎంకేలో చేరగా, ఆదివారం మరో మూడు జిల్లాల కార్యదర్శులు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. వలసలు తథ్యం.. తూత్తుకుడి జిల్లా రజనీ మక్కల్ మండ్రం కార్యదర్శి జోషఫ్ స్టాలిన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్ సెల్వానంద్, తేని కార్యదర్శి గణేషన్ తమ మద్దతుదారులతో కలిసి ఆదివారం ఉదయం తేనాం పేటలోని డీఎంకే కార్యాలయానికి వచ్చారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో ఈ ముగ్గురు నేతలు డీఎంకేలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి స్టాలిన్ ఆహా్వనించారు. ఈ ముగ్గురి మద్దతుదారులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి చేరిక కార్యక్రమం జరిగింది. స్టాలిన్ ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో 200 కాదు, 234 నియోజకవర్గాల్ని డీఎంకే కూటమి కైవసం చేసుకోవడం ఖాయం అన్నట్టు ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రుణమాఫీతో పాటు వృద్ధాప్య పింఛన్ సక్రమంగా అందే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. చెప్పే వచ్చాం.. డీఎంకేలో చేరబోతున్నట్టుగా రజనీ మక్కల్ మండ్రం పెద్దలతో చెప్పే వచ్చినట్టు ఆ మూడు జిల్లాల కార్యదర్శులు పేర్కొన్నారు. తమ అభిమాన నాయ కుడు రజనీ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూశామని, ఆరోగ్య సమస్యలను పరిగణించాల్సి ఉందన్నారు. రాజకీయ పయనం రజనీతో సాధ్యం కాదని తేలడంతో డీఎంకేలోకి చేరామని తెలిపారు. తాము డీఎంకేలో చేరబోతున్నట్టుగా రజనీ మక్కల్ మండ్రం పెద్దలకు తెలియజేశామని, వారు ఎవరి ఇష్టం వారిది అని సూచించారని పేర్కొన్నారు. త్వరలో మరి కొంత మంది రజనీ మక్కల్ మండ్రం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. తమ లక్ష్యం డీఎంకేను అధికారంలోకి తీసుకురావడమేనని పేర్కొన్నారు. వీడియో వైరల్..... ఉదయాన్నే ట్రాక్ షూట్, హెల్మెట్ ధరించి స్టాలిన్ స్పోర్ట్స్ సైకిల్ తొక్కుతూ దూసుకెళ్తున్న వీడియో ఒకటి ఆదివారం వైరల్‌గా మారింది. ఆరోగ్య సంరక్షణలో ముందుండే స్టాలిన్ ఈ వీడియోలో ఎలాంటి భద్రత లేకుండా, కేవలం సైక్లింగ్ చేసే వారితో కలిసి స్టాలిన్ ముందుకు సాగడం, రోడ్డుపై వెళ్తున్న వారికి అభివాదం తెలియజేయడం గమనార్హం. -
రజినీకాంత్ నాటకాలు ఆడుతున్నారు
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజినీకాంత్‌పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి సూచనలు కనబడటం లేదని, రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలను ఆదరిస్తునపుడు రాజకీయ ప్రవేశంపై అయన ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. కాగా లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని గతంలో ఆయన సోదరుడు సత్యనారాయణరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ ప్రకటనపై నాన్చుడు ధోరణి అనుసరిస్తూ చివరకు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. తలైవా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని ఇదివరకే రజినీ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన మరోసారి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ ఎన్నికలకు నేను దూరమే: రజినీ
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఉప ఎన్నికలకు తాను దూరమేనని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టంచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు తెలిపారు. తలైవా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. అయితే, పార్టీ ప్రకటనపై నాన్చుడు ధోరణి అనుసరిస్తూ చివరకు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలు దూరం అని ప్రకటించారు. ఎవరికీ తన మద్దతు అన్నది లేదని, తన మక్కల్ మండ్రం జెండా, తన ఫొటోలను ఏ ఒక్కరూ ఉపయోగించ కూడదన్న హెచ్చరికలు చేసి ఉన్నారు. అదే సమయంలో అభిమానులకు తరచూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రజనీ ముందు ఆదివారం మీడియా వర్గాలు ఓ ప్రశ్నను ఉంచాయి. చెన్నై విమానాశ్రయం నుంచి వెలుపలకు వచ్చిన రజనీ కాంత్‌ను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించాయి. తర్వాత చూసుకుందామంటూ తలైవా రజనీకాంత్ ముందుకు సాగారు. చివరకు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం అంటున్నారుగా అలాంటప్పుడు రాష్ట్రంలో 21 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారా అని ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా, లేదు తాను ఆ ఎన్నికలకూ దూరం అంటూ ముందుకు సాగారు. ఉప ఎన్నికల బరిలో తాను దిగబోనని తలైవా స్పష్టం చేయడం గమనార్హం. ఇక, రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కృష్ణగిరిలో మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ జాప్యం చేయడం లేదని, అన్ని సక్రమంగా పూర్తి చేసుకుని, నిదానంగా పనుల్ని ముగించుకుని పార్టీని ప్రకటిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పార్టీ విషయంగా రజనీకాంత్ ప్రకటన చేస్తారన్నారు. -
మా టార్గెట్ 2021: రజనీకాంత్
సాక్షి, చెన్నై : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్ స్టార్, రజనీ మక్కల్ మండ్రం అధినేత రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయమని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
టీవీ చానెల్ ఏర్పాటులో రజనీకాంత్
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ నెలకొల్పిన రాజకీయ ఫోరం రజనీ మక్కల్ మంద్రమ్..టీవీ చానెల్‌ను పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్ వద్ద ఆ చానెల్ పేరును నమోదుచేసేందుకు యత్నిస్తున్నట్లు స్వయంగా రజనీకాంతే తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలసి అమెరికా బయల్దేరే ముందు ఆయన విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. తాము అనుకుంటున్న పేరుతోనే ఎవరో చానెల్ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసిందని, వారి కన్నా ముందే ఆ పేరును నమోదుచేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని ప్రశ్నించగా, ఇంకా తాను రాజకీయ పార్టీని నెలకొల్పలేదని, ఎన్నికల్లో పోటీపై తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. -
సొంత చానెల్ పెట్టనున్న సూపర్ స్టార్..?
ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే వాటికంటూ సొంత టీవీ చానెల్ ఉండటం తప్పనిసరిగా మారింది. ఇదే అంశాన్ని ఫాలో అవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులు ఎన్నో ఏళ్లుగా తలైవా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31 తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించారు రజనీకాంత్. ‘మక్కల్ మంద్రమ్’ అనే పార్టీని స్థాపించిన రజనీకాంత్.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని కూడా ప్రకటించారు. పార్టీ పేరును అనౌన్స్ చేశారు. కానీ అది ఇంకా పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు. ప్రస్తుతం రజనీ పార్టీ నిర్మాణ కార్యకలపాలను ఓ ప్రముఖునికి అప్పజెప్పారనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్ పేరు మీద ఓ టీవీ చానెల్‌ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్ మార్క్‌ను కూడా రిజిస్టర్ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాక ప్రస్తుతం ట్రేడ్ మార్క్ లోగోకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం తెలియలేదు. ఇక సినిమాల విషయానికోస్తే రజనీకాంత్ నటించిన పేట్టా విడుదలకు సిద్ధంగా ఉంది. -
కుల, జాతి సంఘాల వ్యక్తులపై నిషేధం : రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సరికొత్త పంథాను ఎంచుకున్నారు. రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందుగానే సభ్యత్వాల నమోదు చేయించాలని రజనీకాంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రజనీకి సంబంధించిన పార్టీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటిపోవడం విశేషం. అయితే మక్కల్ మండ్రం విధివిధానాలతో కూడిన 32 పేజీల పుస్తకాన్ని రజనీకాంత్ మంగళవారం విడుదల చేశారు. దీనిలో కుల, మత, వారసత్వరాజకీయాలకు చోటులేదని స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి ఒకే పదవి అని మక్కల్ మండ్రం విధివిధానాల్లో పేర్కొన్నారు. ఏదైనా కుల, జాతి సంఘాల్లోని వ్యక్తులకు రజనీ మక్కల్ మండ్రంలో నిషేధం విధించారు. అంతేకాకుండా మక్కల్ మండ్రం జెండాను కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదని ఆంక్షలు విధించారు. కేవలం సమావేశాలున్న సమయాల్లో మాత్రమే వాడాలని సూచించారు. మక్కల్ మండ్రం గురించి పబ్లిక్‌లో ఎవరూ మాట్లాడరాదని ఆంక్షలు విధించారు.