
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు రజనీకాంత్ రాజకీయాలపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో మక్కల్ మన్రం నేతలు వలసబాట పట్టారు. నచ్చిన పార్టీ దిశగా కదిలిపోతున్నారు. అలా వెళ్లిపోతున్న వారికి రజనీ మక్కల్ మన్రం రైట్..రైట్ చెప్పింది. వలసలకు అభ్యంతరం లేదు..అయితే ముందుగా మన్రానికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరండని సోమవారం విజ్ఞప్తి చేసింది.
రాజకీయ ప్రవేశంపై రెండు దశాబ్దాలుగా ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ మూడేళ్ల క్రితం స్పందించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని 2017లో చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగారు. రజనీ ఆదేశాల మేరకు అభిమాన సంఘాలు.. మక్కల్ మన్రాలుగా మారిపోయాయి. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రజనీకాంత్ పార్టీ ఊసెత్తలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ స్థాపన పెద్ద చర్చనీయాంశం కావడంతో గత ఏడాది ఆఖరులో రజనీ మళ్లీ రంగప్రవేశం చేశారు. మక్కల్ మన్రం జిల్లా ఇన్‌చార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయసేకరణ చేశారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీ ప్రకటన, 2021 జనవరిలో పార్టీ స్థాపన, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ అంటూ ప్రకటించారు.
ఈలోగా ‘అన్నాత్తే’ షూటింగ్ ముగించుకువస్తానని హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారినపడి గత నెల 29న చెన్నైకి చేరుకున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని, పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన అభిమానుల గుండెల్లో బాంబులా పేలింది. చెన్నై పోయస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టి వత్తిడి చేసినా, చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టినా రజనీకాంత్ చలించలేదు. ఇక చేసేదేమీ లేకపోవడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. వీరిలో నలుగురు ప్రముఖులు రెండురోజుల క్రితం డీఎంకేలో చేరిపోయారు. మిగిలిన వారు సైతం వేర్వేరు పారీ్టల వైపు చూస్తున్నారు.
అలాగే వెళ్లిపోండి, అయితే..
ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో రజనీ మక్కల్ మన్రం ప్రధాన సారధుల్లో ఒకరైన సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రజనీ మక్కల్ మన్రంలోని వారు ఏదైనా పారీ్టలోనైనా చేరవచ్చు. అయితే మన్రం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లండ’ని అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment