జల సంరక్షణపై రైతులకు అవగాహన
గుర్రంపోడు : వర్షపు నీటిని భూమిలోకి ఇంకింప జేయడం ద్వారానే భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని తెలంగాణ జల సంరక్షణ వేదిక అధ్యక్షుడు అయ్యప్ప మాసాజీ అన్నారు. సోమవారం మండలంలోని మక్కపల్లిలో జల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు కందకాలను, వాలుకు అడ్డంగా నీటి గుంతలను తవ్వుకోవాలన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింప జేసుకుంటే బోరు బావుల్లో నీరు సరిపడా లభ్యమవుతుందని తెలిపారు. రైతులు వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు తమ పొలాల్లో సామూహికంగా కందకాలు తవ్వుకోవాలని సూచించారు. కందకాలు తవ్వుకున్న ప్రాంతాల్లో గతంలో ఎండిన బావుల్లో నీరు లభిస్తుందని అన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకోవడం, రాతికట్టడాలు లాంటి జలసంరక్షణ పద్ధతులు పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వృ«థా అయ్యే నీటిని నేలలో ఇంకింప జేస్తే కరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చన్నారు. భాస్కర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంతో జల సంరక్షణకు గాను పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ లెంకల అశోక్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.