makloor
-
ప్రియుడితో కలిసి.. కన్న కూతురిని కడతేర్చిన తల్లి
సాక్షి, నిజామాబాద్: అభంశుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్యచేసిందో తల్లి.. వివరాల్లోకి వెళ్తే.. మక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. నార్త్ రూరల్ సీఐ నరహరి కథనం మేరకు విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవాని, గురునాథం భార్య భర్తలు గతంలో రెండేళ్లపాటు నిర్మల్‌లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు. వీరికి నాగలక్ష్మి (6), గీతమాధవి (14 మాసాలు) అనే ఇద్దరు కూతుర్లున్నారు. అయితే నిర్మల్ నుంచి ఐదేళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గతనెల 14న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్ కేసు నమో దు చేశారు. నిజామాబాద్‌లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వేస్టేషన్లో ఆమె ప్రియుడైన బాన్సువాడ కొల్లూరుకు చెందిన దుండగుల శ్రీనుతో ఉండగా గుర్తించాడు. చిన్నకూతురు గీతమాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతును లిమి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆ శ్రయించగా భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్ రైల్వే కమాన్ వద్ద హత్య చేసి మాక్లూర్ చిన్నాపూర్ గండిలో పడవేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..
సాక్షి, నిజామాబామాద్: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త బతుకు దెరువుకోసం దుబాయ్ వలసబోయాడు. కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటానన్న భార్య అకస్మాత్తుగా కన్ను మూసింది. ఆ విషయం తెలియకుండానే... దేశంకాని దేశంలో భర్తా మరణించాడు. తల్లి చనిపోయి, ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు.. దిక్కు తెలియని పక్షులయ్యారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన మక్కల నాని(35)ది నిరుపేద కుటుంబం. ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. కుటుంబ పోషణ కూడా భారమయింది. అప్పులు చేసి మరీ 3 సంవత్సరాల క్రితం నాని దుబాయ్ వెళ్లాడు. భర్త అటు వెళ్లిన ఏడాదికే భార్య లక్ష్మి అనారోగ్యంతో ఇక్కడ మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఈ విషయం దుబాయ్‌లో ఉన్న భర్తకు తెలియకుండా ఉంచారు. పెద్దకూతురు శైలజ పెళ్లీడుకు వచ్చిందని చెప్పి కులపెద్దలే వివాహం జరిపించారు. లక్ష్మి మరణం విషాదం నుంచి తేరుకోకముందే.. నాని మరణవార్త వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. చిన్న కూతురు పావని, కొడుకు రాము మాత్రమే ఉన్నారు. పావని ఇళ్లల్లో పనులు చేస్తుంది. రాము ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. దుబాయ్‌లో తండ్రి మరణించాడన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి నాని మృతదేహాన్ని తెప్పించాలని, ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: మూడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. తీవ్ర మనో వేదనతో తల్లికి విషయం చెప్పి ఫోన్ కట్.. -
మామిడిపల్లి వద్ద కారు బీభత్సం
మక్లూరు: నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మామిడిపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొని ఆపై రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి హోటల్లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోయాయి. ఓ మహిళ కంటికి తీవ్రగాయమైంది. హోటల్లో ఉన్న మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి కారు నడిపారని స్థానికులు చెబుతున్నారు. నిందితులతో స్థానిక గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు కారులో ఉన్న వాళ్లను మక్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నే చంపించాడు!
నిజామాబాద్: మక్లూరు మండలం అమ్రజ్ పూర్ లో పరువు హత్య ఆలస్యంగా బయటపడింది. గత నెల 27న జక్రాన్ పల్లి మండలం పడకల్ వద్ద రోజా అనే యువతి హత్యకు గురైంది. ఆమెను కన్నతండ్రి రాజన్న హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వేరే కులం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే కోపంతో అతడీ కిరాతకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితుడు రాజన్నతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఘటనా స్థలంలో దొరికిన మృతురాలి పాదరక్ష ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
తండ్రితో పాటు తనయ..
మాక్లూర్/బాల్కొండ, న్యూస్‌లైన్: దసరా పండుగ సెలవుల్లో కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. సెలవులు ముగియడంతో తండ్రితో కలిసి సంతోషంగా బడిబాట పట్టారు. మరో అడుగు వేస్తే చాలు బళ్లోకి చేరుతామనగా.. వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ప్రమాదంతో తండ్రితో పాటు ఓ కుమార్తె చనిపోగా, మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. తమ్ముడి కుమారుడు, గ్రామానికి చెందిన పిల్లలూ గాయాలపాలయ్యారు. బాల్కొండ మండలం పోచంపాడ్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంతో మాక్లూర్ మండలంలోని అమ్రాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్రాద్ గ్రామానికి చెందిన ఆసది బాలయ్య కరీంనగర్ జిల్లా వేములవాడ వీఆర్ఓగా పని చేస్తున్నారు. ఆయనకు సొంత ఆటో ఉంది. దీన్ని తమ్ముడు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పిల్లల సెలవులు ముగియడంతో మంగళవారం వారిని బడికి పం పేందుకు తానే పిల్లలతో ఆటోలో పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు బయల్దేరారు. బాలయ్యతో పాటు ఆయన కుమార్తెలు తనూజ, నిర్మల, తమ్ము డి కుమారుడు మురళీధర్, గ్రామానికి చెందిన విద్యార్థినులు సింధూజ(ఏడోతరగతి), మమత(ఐదోతరగతి)కూడా ఆటోలో ఉన్నారు. ఐదు నిమిషాలైతే గమ్యానికి చేరుతారనగా.. పోచంపాడ్ క్రాసింగ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలయ్యతో పాటు ఆయన కుమార్తె తనూజ మృతిచెందారు. మురళీధర్, సింధూజలకు తీవ్రగాయాలు కాగా, నిర్మల, మమతలు స్వల్పంగా గాయపడ్డారు. నలుగురూ ఆడపిల్లలే.. బాలయ్యకు నలుగురు ఆడపిల్లలే. వారిని విద్యావంతులను చేయాలనే తలంపుతో చదివిస్తున్నారు. పెద్దమ్మాయి ఉదయ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, రెండో అమ్మాయి నిర్మల ఎనిమిదో, మూడవ అమ్మాయి తనూజ ఆరోతరగతి, నాల్గో అమ్మాయి మంజుల ఐదో తరగతి చదువుతున్నారు. ఇందులో తనూజ, నిర్మల పోచంపాడ్‌లో చదువుతున్నారు. సెలవులకు ముందు వరకు తమలో ఒకరిగా ఉన్న తనూజ రోడ్డు ప్రమాదంలో మరణించదంటే తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. రోడ్డు ప్రమాదం తండ్రీకూతుళ్లను బలిగొనడంతో అమ్రాద్‌లో విషాదం అలుముకుంది.