సాక్షి, నిజామాబామాద్: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త బతుకు దెరువుకోసం దుబాయ్ వలసబోయాడు. కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటానన్న భార్య అకస్మాత్తుగా కన్ను మూసింది. ఆ విషయం తెలియకుండానే... దేశంకాని దేశంలో భర్తా మరణించాడు. తల్లి చనిపోయి, ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు.. దిక్కు తెలియని పక్షులయ్యారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లీ గ్రామానికి చెందిన మక్కల నాని(35)ది నిరుపేద కుటుంబం. ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. కుటుంబ పోషణ కూడా భారమయింది. అప్పులు చేసి మరీ 3 సంవత్సరాల క్రితం నాని దుబాయ్ వెళ్లాడు. భర్త అటు వెళ్లిన ఏడాదికే భార్య లక్ష్మి అనారోగ్యంతో ఇక్కడ మృతి చెందింది.
కుటుంబ సభ్యులు ఈ విషయం దుబాయ్‌లో ఉన్న భర్తకు తెలియకుండా ఉంచారు. పెద్దకూతురు శైలజ పెళ్లీడుకు వచ్చిందని చెప్పి కులపెద్దలే వివాహం జరిపించారు. లక్ష్మి మరణం విషాదం నుంచి తేరుకోకముందే.. నాని మరణవార్త వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. చిన్న కూతురు పావని, కొడుకు రాము మాత్రమే ఉన్నారు. పావని ఇళ్లల్లో పనులు చేస్తుంది. రాము ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. దుబాయ్‌లో తండ్రి మరణించాడన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి నాని మృతదేహాన్ని తెప్పించాలని, ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చదవండి: మూడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. తీవ్ర మనో వేదనతో తల్లికి విషయం చెప్పి ఫోన్ కట్..
Comments
Please login to add a commentAdd a comment