ఎక్సైజ్ అధికారులపై దాడి
కళ్లల్లో కారం చల్లి రాళ్లతో దాడి చేసిన గుడుంబా విక్రేతలు
ఎస్ఐతోపాటు ఇద్దరికి గాయాలు
ఆరుగురు నిందితుల అరెస్టు..
పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్, న్యూస్‌లైన్: గుడుంబా స్థావరాలపై దాడులు చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ అధికారులపై గుడుంబా విక్రేతలు ఎదురుదాడికి దిగారు. కళ్లల్లో కారం చల్లి, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనతో భీతిల్లిన ఎక్సైజ్ అధికారులు ప్రా ణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశా రు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, మలక్‌పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేణుక, నారాయణగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మంగళవారం ఈ దాడులు జరిగాయి.
సరూర్‌నగర్ ఎక్సైజ్ ఎస్ఐ రాం గోపాల్ ఆధ్వర్యంలోని 8 మంది సిబ్బంది సింగరేణికాలనీలో గుడుంబా విక్రయిస్తున్న వెంకట్రాం ఇంటిపై దాడి చేసి పెద్ద ఎత్తున గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకునే సమయంలో కొందరు మహిళల ను ఎస్ఐపైకి వెంకటరాం ఉసిగొల్పాడు. దీంతో వారు కారం తీసుకొచ్చి ఎస్ఐ కళ్లలో చల్లి, రాళ్లతో దాడి చేశారు. మరో ఇద్దరు సిబ్బందిని గాయపరిచి, జీపు అద్దాలు పగలగొట్టారు. మళ్లీ వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మిగతా సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన శాంతి, సుగుణ, పద్మ, మోతి, హర్యా, కె.శాంతిలను అరెస్ట్ చేశామని, మరో మహిళ విజయలక్ష్మితోపాటు వెంకట్రాం పరారైయ్యారని సైదాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.