Malakpet Hospital
-
మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ బాలింతల మృతిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకి బాలింతలు మృతి చెందారని కమిటీ నిర్ధారణకి వచ్చింది. సిజేరియన్ చేయించుకున్న 18 మందికి ఇన్ఫెక్షన్ సోకడంతో నిమ్స్‌కు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్ కొనసాగుతోందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. రెండో కాన్పుకోసం వచ్చిన సిరివెన్నెల.. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే మహేష్ భార్య సిరివెన్నెల (25) రెండో కాన్పు కోసం సోమవారం ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు బుధవారం సిజేరియన్ చేశారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతి కొద్ది సేపటికే పల్స్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర వైద్య సేవల పేరుతో వైద్యులు ఆమెను గాంధీకి తరలించారు. 2డీ ఎకో పరీక్ష సహా ఇతర వైద్య పరీక్షలు చేశారు. గురువారం రాత్రి పది గంటలకు మరణించింది. అయితే ఆమె గత ఐదు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆమెకు సిజేరియన్ చేయడం, ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడానికి కారణమయ్యారని మృతురాలి భర్త మహేష్ ఆరోపించారు. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుండగా...అప్పుడే పుట్టిన శిశువు కనీసం ముర్రుపాలకు కూడా నోచుకోలేదని బంధువులు విలపించారు. తొలి కాన్పు కోసం వచ్చిన శివాని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన రవీందర్, వెంకటలక్ష్మి కుమార్తె శివాని(25) మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 10 తేదీన ఏరియా ఆసుపత్రిలో చేరి్పంచగా.. వైద్యులు బుధవారం ఉదయం సిజేరియన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా విరేచనాలతో బాధపడింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. అయితే బాలింత మరణానికి థైరాయిడ్ కారణమని వైద్యులు చెబుతుండగా, సిజేరియన్ తర్వాత కుట్లు వేసే సమయంలో సరిగా శుభ్రం చేయక పోవడం వల్లే తన భార్య చనిపోయిందని, ఆరోగ్యంగా ఉన్న తన భార్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జగదీష్‌కుమార్ ఆరోపించారు. చదవండి: (Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన) -
మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో విషాదం.. ఇద్దరు బాలింతలు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపుతోంది. బాధిత బంధువుల ఆందోళనతో అస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల రెండో కాన్పు కోసం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెంగ్యూ జ్వరం ఉన్నది గుర్తించకుండా డెలీవరీ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. వెంటనే బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్లేట్స్ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆమె మరణించినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మరో బాలింత శివాని సైతం డెలివరీ అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు బలయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట, చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకుకదిలే ప్రస్తకే లేదని వెల్లడించారు. వైద్యాధికారులు ఏమన్నారంటే.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్ లేదని తెలిపారు. డెంగ్యూ ఉంటే తాము డెలివరీ చేయమని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశమన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్‌రేట్ పెరిగిందని, హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గాంధీకి తరలించామన్నారు. శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందన్నారు. చదవండి: పండుగ ప్రయాణం.. నరకయాతన -
సర్కారీ కాదు.. ‘కార్పొరేట్’ దవాఖానా!
నీలోఫర్, పేట్లబురుజు, మలక్‌పేట్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతులు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు..’ ఇది ఒకప్పటి మాట..! ‘నేను పోను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి..’ ఇదీ ఇప్పటి మాట..! పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానా లను తీర్చిదిద్దుతోంది. ట్రాలీలు, వీల్చైర్లు, అత్యాధునిక హైడ్రాలిక్ పడకలు, ఖరీదైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకో రంగు చొప్పున దుప్పట్లు మారుస్తూ.. కార్పొరేట్ లుక్ తెస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుండటంతో రోగులు కార్పొరేట్ ఆస్పత్రులను వదిలి ప్రభుత్వాస్పత్రుల బాట పడుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం వల్ల కూడా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ రూపుమారిన ‘మలక్‌పేట్’ 100 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 800–900 మంది గర్భిణు లు వస్తుండగా.. ఇక్కడ నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 8 ప్రసవాలు జరుగుతున్నాయి. రూ. 1.05 కోట్లతో రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్ పడకలతో పాటు వీల్చైర్లు, ట్రాలీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో శిథిలావస్థకు చేరిన టాయ్లెట్లను తొలగించి పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, మరో ఓటీని సిద్ధం చేయడంతో ఒకేసారి నాలుగు ప్రసవాలు చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, నాంపల్లి, గోల్కొండ, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు సైతం కార్పొరేట్ హంగులు సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్‌ను తలపిస్తున్న నీలోఫర్.. నీలోఫర్ ఆస్పత్రి.. దేశంలోనే అతిపెద్ద రెఫరల్ సెంటర్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి రోగుల వస్తుంటారు. ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 600 మంది రోగులు వస్తుంటారు. రూ.68 కోట్లతో నిర్మించిన రాజీవ్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌ను ప్రభుత్వం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. దీంతో పడకల సంఖ్య వెయ్యికి పెరిగింది. గర్భిణులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక వసతులను కల్పించింది. హైడ్రాలిక్ పడకలతో పాటు వెంటిలేటర్లు, బెడ్‌సైడ్ మానిటర్లు, ఫొటో థెరపీ యూనిట్లను సమకూర్చింది. వైద్య పరీక్షల కోసం 24 గంటల ల్యాబ్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూప్ రక్తాన్ని అందజేసేందుకు అత్యాధునిక బ్లడ్‌బ్యాంక్‌ను, బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. తీవ్రమైన రక్తస్రావం, బీపీ, షుగర్ ఇతర సమస్యలతో బాధపడుతున్న బాలింతలకు అత్యవసర చికిత్స అందించేందుకు 10 పడకలతో అత్యాధునిక ఎంఐసీయూ అందుబాటులోకి తెచ్చింది. కిలోకన్నా తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు లెవల్–3 ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు నాలుగు హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. రోగులు కూర్చునేందుకు వార్డుల్లో కుర్చీలు, ట్రాలీలు, మంచినీటి ట్యాంక్‌లను, పడకలపై దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు అధునాతన లాండ్రీని ఏర్పాటు చేశారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజులో.. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చి ల్యాబ్‌లను ఆధునీకరించారు. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజులో రోజుకు సగటున 40–60 ప్రసవాలు జరుగుతుండగా, 400 పడకలున్న సుల్తాన్‌బజార్‌లో రోజుకు సగటున 25–30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో అధునాతన ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.