సర్కారీ కాదు.. ‘కార్పొరేట్‌’ దవాఖానా! | Trendy facilities in the Niloufer, petlaburuju, malakpet hospitals | Sakshi
Sakshi News home page

సర్కారీ కాదు.. ‘కార్పొరేట్‌’ దవాఖానా!

Published Thu, Jun 29 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

సర్కారీ కాదు.. ‘కార్పొరేట్‌’ దవాఖానా!

సర్కారీ కాదు.. ‘కార్పొరేట్‌’ దవాఖానా!

నీలోఫర్, పేట్లబురుజు, మలక్‌పేట్‌ ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతులు
 
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు..’ ఇది ఒకప్పటి మాట..! ‘నేను పోను బిడ్డో కార్పొరేట్‌ ఆస్పత్రికి..’ ఇదీ ఇప్పటి మాట..! పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానా లను తీర్చిదిద్దుతోంది. ట్రాలీలు, వీల్‌చైర్లు, అత్యాధునిక హైడ్రాలిక్‌ పడకలు, ఖరీదైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకో రంగు చొప్పున దుప్పట్లు మారుస్తూ.. కార్పొరేట్‌ లుక్‌ తెస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుండటంతో రోగులు కార్పొరేట్‌ ఆస్పత్రులను వదిలి ప్రభుత్వాస్పత్రుల బాట పడుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం వల్ల కూడా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్‌
 
రూపుమారిన ‘మలక్‌పేట్‌’ 
100 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 800–900 మంది గర్భిణు లు వస్తుండగా.. ఇక్కడ నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 8 ప్రసవాలు జరుగుతున్నాయి. రూ. 1.05 కోట్లతో రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్‌ పడకలతో పాటు వీల్‌చైర్లు, ట్రాలీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో శిథిలావస్థకు చేరిన టాయ్‌లెట్లను తొలగించి పునర్‌నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా, మరో ఓటీని సిద్ధం చేయడంతో ఒకేసారి నాలుగు ప్రసవాలు చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్‌ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, నాంపల్లి, గోల్కొండ, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు సైతం కార్పొరేట్‌ హంగులు సంతరించుకుంటున్నాయి.
 
కార్పొరేట్‌ను తలపిస్తున్న నీలోఫర్‌..
నీలోఫర్‌ ఆస్పత్రి.. దేశంలోనే అతిపెద్ద రెఫరల్‌ సెంటర్‌. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి రోగుల వస్తుంటారు. ఆస్పత్రి ఔట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 600 మంది రోగులు వస్తుంటారు. రూ.68 కోట్లతో నిర్మించిన రాజీవ్‌ ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను ప్రభుత్వం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. దీంతో పడకల సంఖ్య వెయ్యికి పెరిగింది. గర్భిణులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక వసతులను కల్పించింది. హైడ్రాలిక్‌ పడకలతో పాటు వెంటిలేటర్లు, బెడ్‌సైడ్‌ మానిటర్లు, ఫొటో థెరపీ యూనిట్లను సమకూర్చింది.

వైద్య పరీక్షల కోసం 24 గంటల ల్యాబ్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూప్‌ రక్తాన్ని అందజేసేందుకు అత్యాధునిక బ్లడ్‌బ్యాంక్‌ను, బ్లడ్‌ కాంపోనెంట్‌ సెపరేటర్‌ మిషన్‌ను ఏర్పాటు చేసింది. తీవ్రమైన రక్తస్రావం, బీపీ, షుగర్‌ ఇతర సమస్యలతో బాధపడుతున్న బాలింతలకు అత్యవసర చికిత్స అందించేందుకు 10 పడకలతో అత్యాధునిక ఎంఐసీయూ అందుబాటులోకి తెచ్చింది. కిలోకన్నా తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులకు చికిత్స అందించేందుకు లెవల్‌–3 ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌తో పాటు నాలుగు హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. రోగులు కూర్చునేందుకు వార్డుల్లో కుర్చీలు, ట్రాలీలు, మంచినీటి ట్యాంక్‌లను, పడకలపై దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు అధునాతన లాండ్రీని ఏర్పాటు చేశారు.
 
సుల్తాన్‌బజార్, పేట్లబురుజులో..
పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చి ల్యాబ్‌లను ఆధునీకరించారు. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజులో రోజుకు సగటున 40–60 ప్రసవాలు జరుగుతుండగా, 400 పడకలున్న సుల్తాన్‌బజార్‌లో రోజుకు సగటున 25–30 ప్రసవాలు జరుగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో అధునాతన ఆపరేషన్‌ థియేటర్లు, ల్యాబ్‌లు, బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement