మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
సాక్షి, హైదాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మరణానంతరం ఆమె పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల్లోని రూ.33.5 లక్షలు కాజేశారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్ ఆరోగ్య శాఖ పరిధిలోని స్టేట్ హెల్త్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆర్గనైజేషన్‌లో సర్వీస్ ఇంజినీర్‌గా పని చేశారు. 2003లో రిటైర్ అయిన ఆయన 2015 అక్టోబర్‌లో చనిపోయారు. అక్తర్ భార్య నూర్జహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020 జూన్ 2న ఆమె కన్నుమూశారు.
గజ్వేల్ జిల్లా నుంచి వచ్చి ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్నదమ్ములు మహ్మద్ సమియుద్దీన్, ఫసియుద్దీన్‌లు నూర్జహాన్ పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ రూపొందించారు. వీటిని రెండు బ్యాంకుల్లో సమర్పించి నూర్జహాన్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు పొందారు. ఓ బ్యాంకుల్లో ఉన్న నూర్జహాన్ ఖాతా నుంచి రూ.3.5 లక్షలు, మరో బ్యాంకులో ఉన్న అక్తర్ ఖాతా నుంచి రూ.30 లక్షలు దఫదఫాలుగా డ్రా చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న నూర్జహాన్ కుమారుడు జకీర్ హుస్సేన్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తన తల్లి ఏ సందర్భంలోనూ ఎవరికీ హిబా ఇవ్వలేదని, ఆ పేరుతో నిందితులు తప్పుడు పత్రాలు సృష్టించారని జకీర్ ఆరోపించారు. ఈ మేరకు నమోదైన కేసును మలక్‌పేట పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో దీన్ని రీ–రిజిస్టర్ చేసుకున్న సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాస్ రావు దర్యాప్తు ప్రారంభించారు.