అత్యంత ఖరీదైన గాలింపు..!
విమానం కోసం రూ.264 కోట్ల వ్యయం
గల్లంతై నెలైనా ఆచూకీ లేని మలేసియా బోయింగ్
సిడ్నీ(ఆస్ట్రేలియా): సముద్రంలో కుప్పకూలినట్లు భావిస్తున్న మలేసియా బోయింగ్ ఎంహెచ్ 370 విమానం ఆచూకీ కోసం రూ.వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి. భారీ యుద్ధనౌకలు, విమానాలతో నెల రోజులకుపైగా అన్వేషిస్తున్నా ఇంతవరకు ఫలితం దక్కకున్నా వ్యయం మాత్రం తడిసిమోపెడవుతోంది. ఈ గాలింపు వైమానికయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. 26 దేశాలకు చెందిన యుద్ధవిమానాలు, నౌకలు, జలాంతర్గాములు, ఉపగ్రహాల సాయంతో దక్షిణ హిందూ మహాసముద్రాన్ని జల్లెడ పడుతుండడం తెలిసిందే. వీటిని మోహరించేందుకు ఇప్పటికే సుమారు రూ.264 కోట్లు ఖర్చయినట్లు రక్షణరంగ నిపుణుల అంచనా. ఇందులో సగాన్ని ఆస్ట్రేలియానే భరించింది.
నెల కిందట గల్లంతైన ఈ విమానం ఆచూకీ కనిపెట్టేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు గాలింపునకు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆంగస్ హ్యూస్టన్ చెప్పారు. అయితే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామనేది సమస్య కాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2009లో అట్లాంటిక్ మహాసముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్లాక్‌బాక్స్ వెలికితీతకు వెచ్చించిన డబ్బు కంటే తాజాగా రెట్టింపు ఖర్చయినట్లు భావిస్తున్నారు.
గల్లంతైన విమాన ప్రయాణికుల్లో అత్యధికులు చైనా వారే కావడంతో ఆ దేశం 18 నౌకలు, 8 హెలికాప్టర్లతో గాలిస్తోంది. చైనా యుద్ధనౌకల కోసం రోజుకు రూ.62 లక్షలు ఖర్చవుతోంది. తాము రూ.18.6 కోట్లు వెచ్చించినట్లు అమెరికా తెలిపింది. కాగా, మంగళవారం గాలించిన నౌకలకు బ్లాక్స్బాక్స్లకు సంబంధించి ఎలాంటి సంకేతాలూ అందలేదు. మలేసియా విమానంలోని బ్లాక్స్‌బాక్స్ బ్యాటరీల 30 రోజుల జీవితకాలం ముగింపునకు చేరడంతో గాలింపును ముమ్మరం చేశారు.