Malaysian Airlines flight
-
హచ్ డాగ్‌లా వెంటే.. వెన్నంటే..
2014, మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది... అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు.. మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు.. విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్ క్లోజ్ చేశారు.. ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్.. ఇరిడియం నెక్ట్స్.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఇలా.. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ సిస్టం ద్వారా ట్రాక్ చేస్తున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ అందుతుంది. ఎంహెచ్ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్ బాక్స్ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
మలేషియా విమాన ఘటనలో కుట్రకోణం?
మలేషియా నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఉన్నట్టుండి ఎందుకు ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వచ్చింది? 166 మందితో వెళ్తున్న ఆ విమానాన్ని కిందకు దింపడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు మలేషియా పోలీసులకు వచ్చాయి. అందుకే వాళ్లు ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్192 విమానాన్ని అత్యవసరంగా దించేసిన విషయం తెలిసిందే. విమానం బయల్దేరేసరికి అందులో ఎవరైనా కుట్రదారులు ఉన్నారేమో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీపీ ఖాలిద్ అబూ బకర్ తెలిపారు. ఈ విషయమై మలేషియా రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ఫోన్ చేసి అడగడంతో ఈ విషయం తెలిపారు. 159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బోయింగ్ 737-800 విమానాన్ని అత్యవసరంగా దించారు. టేకాఫ్ తీసుకునే సమయంలో కుడివైపు ఒక టైరు పేలిపోవడం, ప్రధాన ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ఇలా దించాల్సి వచ్చిందని మలేషియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. టైరుకు సంబంధించిన కొన్ని ముక్కలు రన్‌వే మీద కనపడటంతో ఏటీసీ నుంచి విమాన కెప్టెన్‌కు హెచ్చరిక సందేశం వెళ్లింది. భద్రత దృష్ట్యా వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పాల్సి వచ్చిందని అంటున్నారు. విమానం వెనక్కి రాగానే మొత్తం 159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దిగిపోయారు. ఈ విమానం మళ్లీ మధ్యాహ్నం 3.30 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బెంగళూరు వస్తుంది. -
మలేషియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన మరో విమానానికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. కౌలాలంపూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కాసేపటికే ఎంహెచ్ 192 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఈ విమానం రాత్రి 11:35కు బెంగళూరుకు చేరుకోవాల్సింది. అయితే సాంకేతిక లోపంతో తిరిగి కౌలాలంపూర్లోనే సురక్షితంగా దిగిందని అధికారులు ప్రయాణికుల బంధువులకు సమాచారమిచ్చారు. తమవారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.