వారికి క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
న్యూఢిల్లీ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం నేపథ్యంలో బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల రాజధాని మాలే నుంచి, మాలేకు ప్రయాణించే వారికి క్యాన్సిలేషన్, ఇతర ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవి 8 నుంచి 14 వరకు తమ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ''ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు మాలే నుంచి లేదా మాలేకు ప్రయాణించే ప్రయాణికులు తమ టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ను చేపట్టుకోవచ్చు. మొత్తం టిక్కెట్ ఛార్జీలను రీఫండ్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాం'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం మాల్దీవుల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ప్రయాణం చేయడం ఇష్టం లేని ప్రయాణికులకు, మొత్తం రీఫండ్ చేస్తామని చెప్పింది. గురువారం ఎయిర్ ఇండియా కూడా ఈ ఛార్జీలను రద్దు చేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం అత్యయిక పరిస్థితి నడుస్తోంది. దీనిపై ప్రపంచ అగ్రనేతలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌తోపాటు మరో ఎనిమిది మంది చట్టసభ సభ్యులను జైలు నుండి విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు పట్టించుకోకపోవడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని దేశీయంగా ప్రజలు ఉద్యమించడం, భారత్, అమెరికా సహా పలు దేశాలు యమీన్‌పై ఒత్తిడి తేవడంతో మాల్దీవులు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది.