malla reddy colleges
-
ఏకధాటిగా ఐటీ దాడులు.. స్పందించిన మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆరా్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ‘ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్.. నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ. 6లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. సంబంధిత వార్త: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయంటున్నారు. మెడికల్ కాలేజీ డొనేషన్స్‌లో డబ్బులు గుంజుకున్నారని ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. ఎంబీబీఎస్‌లో మెనేజ్మెంట్ కోటా లేదు. వివిధ క్యాటగిరీలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్లైన్లోనే, కౌన్సిలింగ్‌లోనే జరుగుతుంది. మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి?. నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలన్న డొనేషన్‌తో నా కాలేజీలో సీటు ఇప్పించలేను. మేము తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్, ఇళ్లలో చేసిన సోదాలో 28 లక్షలు దొరికాయి’ అని తెలిపారు. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శనివారం సుమారు 30 మంది దాతలు రూ.4.70 కోట్ల చెక్కులను మంత్రి కేటీఆర్‌కు ప్రగతిభవన్‌లో అందజేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.50 లక్షలు, మల్లారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన మరో రూ.47 లక్షలు విలువ చేసే 36 చెక్కులను కేటీఆర్‌కు అందజేశారు. వీటితో పాటు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తరపున మరో రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. ► హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా ఎండీ ఐవీఆర్ కృష్ణంరాజు రూ.50 లక్షలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.40 లక్షలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద కేటీఆర్‌కు అందజేశారు. వోక్సెన్ బిజినెస్ స్కూల్ ఎండీ విన్ పూల, రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్, ఎన్.ఎస్. ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ► ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 21 లక్షలు, అక్యురేట్ గ్రీన్ వీడియోస్ రూ.15 లక్షలు, స్కైస్ బిజినెస్ సర్వీసెస్ రూ.11 లక్షలు, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ యుగంధర్ రావు రూ.10 లక్షలు, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సెయింట్ మార్టిస్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, టెక్ సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ► పడాల రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.6 లక్షలు, లహరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరిస్టా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్, జోగినిపల్లి చంద్రశేఖరరావు, జోగినిపల్లి సుధీర్ రూ. 5 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్కి విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్ సెయింట్ అన్నె రూ.5 లక్షల చెక్కులను కేటీఆర్‌కు అందజేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి.రాజేశంగౌడ్ రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు -
ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను గురువారం జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్సిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెబుతూ ఎల్వోఐ జారీ చేసింది. ఈ మేరకు మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి సీహెచ్ మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామంద్రన్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఎల్వోఐ ఆధారంగా ఆ విద్యా సంస్థ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రూ.10 కోట్ల కార్పస్ ఫండ్, మూడేళ్ల పాటు ఉండేలా రూ.30 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాజెక్టు విలువలో 1% ఎండోమెంట్ ఫండ్ లేదా రూ.10 కోట్లు వెచ్చించడంతోపాటు తగిన భవనాలు, వాటిల్లో సదుపాయాలు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా అవి పూర్తి చేశాక ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్‌ను జారీ చేయనుంది. మల్లారెడ్డి మహిళా వర్సిటీతోపాటు టెక్ మహీంద్రా వర్సిటీ ఏర్పాటుకు కూడా ఎల్వోఐ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లోగా అనురాగ్, గురునానక్ , శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిప్‌మర్, వోక్సన్, ఎస్ఆర్ విద్యాసంస్థలకు ఎల్వోఐ జారీ చేసే అవకాశం ఉంది.న్నాయి. -
రూ.30 కోట్లు ఇవ్వకపోతే కాలేజీలు పేల్చేస్తాం..
టీడీపీ ఎంపీకి నక్సల్ పేరుతో ఆగంతకుడి బెదిరింపు సాక్షి, హైదరాబాద్: రూ.30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేనిపక్షంలో నగరంలో ఉన్న మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలను పేల్చివేస్తామని నక్సలైట్ పేరుతో ఓ ఆగంతకుడు తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు సి.హెచ్.మల్లారెడ్డి సెల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మల్లారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా ఎంపీ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఆగంతకుడి నంబర్‌పై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోయిన్‌పల్లికి చెందిన సి.హెచ్.మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఇటీవలే ఎంపీగా గెలుపొందారు. గెలుపొందిన రోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను నక్సలైట్‌నని, తమ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్‌కాల్స్ ఎక్కువ కావడంతో ఎంపీ శనివారం బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కేవలం కాయిన్ బాక్స్‌లనే వినియోగించడం గమనార్హం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మల్లారెడ్డికి సంబంధించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా దర్యాప్తు అధికారులు శనివారం పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, మేడ్చల్ పీఎస్‌ల పరిధిలో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.