రూ.30 కోట్లు ఇవ్వకపోతే కాలేజీలు పేల్చేస్తాం..
టీడీపీ ఎంపీకి నక్సల్ పేరుతో ఆగంతకుడి బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: రూ.30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేనిపక్షంలో నగరంలో ఉన్న మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలను పేల్చివేస్తామని నక్సలైట్ పేరుతో ఓ ఆగంతకుడు తెలుగుదేశం పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సి.హెచ్.మల్లారెడ్డి సెల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మల్లారెడ్డి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా ఎంపీ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఆగంతకుడి నంబర్‌పై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోయిన్‌పల్లికి చెందిన సి.హెచ్.మల్లారెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి ఇటీవలే ఎంపీగా గెలుపొందారు. గెలుపొందిన రోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను నక్సలైట్‌నని, తమ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఫోన్‌కాల్స్ ఎక్కువ కావడంతో ఎంపీ శనివారం బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కేవలం కాయిన్ బాక్స్‌లనే వినియోగించడం గమనార్హం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మల్లారెడ్డికి సంబంధించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా దర్యాప్తు అధికారులు శనివారం పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, మేడ్చల్ పీఎస్‌ల పరిధిలో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.