Malladi venkatakrsnamurthi
-
త్రీమంకీస్ -21
మల్లాది వెంకటకృష్ణమూర్తి డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 21 ‘‘ఆ నాలుగో గాడిద ఏమైంది?’’ జైల్ బాత్రూంలోకి వెళ్తూ వానర్ కపీష్‌ని ప్రశ్నించాడు. ‘‘లేదు. నేను మన ఆడిటోరియంలో వదిలింది నాలుగు గాడిదలనే. ఐదిటిని కాదు’’ కపీష్ జవాబు చెప్పాడు. ‘‘ఇంజినీరింగ్ విద్యార్థివై ఉండి, మూడు తర్వాత ఐదు నంబర్ ఎందుకు వేశావు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాలుగో గాడిద కూడా ఉందని దానికోసం వెదుకుతారని.’’ వాళ్ళు పకపక నవ్వుతూ బాత్ రూంలోకి వెళ్ళారు. ఓ బోర్డ్ మీద ‘విమెన్ రైట్’ అని, దానికి కుడి వైపుకి బాణం గుర్తు, ‘మెన్ లెఫ్ట్’ అని ఎడమ వైపుకి బాణం గుర్తు కనిపించాయి. అంతే కాదు. ఇంకో వాక్యం కూడా ఉంది. విమెన్ ఆర్ ఆల్వేస్ రైట్. ముగ్గురూ లోపలకి వెళ్ళారు. ‘‘ఈ మధ్య బాగా చదువుకున్న వాళ్ళు జైళ్ళకి వస్తున్నట్లున్నారే’’ గోడ మీది రాతల్ని చూసి కపీష్ చెప్పాడు. ‘టి సుబ్బారావ్ వజ్ హియర్.’ ‘జైల్లోకి నిరుద్యోగాన్ని ప్రవేశపెట్టలేవు’ ‘నా ఇల్లు జైల్. నా వృత్తి బాత్రూంలో గడపటం.’ ‘నువ్వు జైల్లో ఉంటే నీ నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్ళే ములాఖత్‌కి వస్తారు.’ ‘మంచి మిత్రుడు నీకు బెయిల్‌ని ఇప్పిస్తాడు. ఉత్తమ మిత్రుడు నీతో అంత్యాక్షరి ఆడతాడు.’ వాటిని చదివి పెద్దగా నవ్వే ఆ ముగ్గురూ దుర్యోధన్ దృష్టిలో పడ్డారు. అతను వారి వంక అసహనంగా చూశాడు. కపీష్ ఓ టాయ్‌లెట్ కేబిన్‌లోకి వెళ్తూంటే బలాఢ్యులైన ఇద్దరు ఖైదీల్లో ఒకతను అతన్ని ఆపి అడిగాడు. ‘‘ఏమిటిలా వచ్చావ్?’’ అదే సినిమా హాల్లో అడిగి ఉంటే, ‘చిల్లర సీట్ల కింద పడిందేమో చూసి ఏరుకోడానికి’ అని, రైల్వే స్టేషన్లో ఐతే, ‘రైలుని తోయడానికి వచ్చానని’ చెప్పేవాడు. ఆ ప్రశ్నకి కపీష్‌కి ఏం జవాబు చెప్పాలో తెలీక తెల్లబోయాడు. ‘‘కొత్తా?’’ ‘‘లేదు. పుట్టినప్పటి నించి బాత్రూంకి వెళ్తున్నాడు’’ వానర్ జవాబు చెప్పాడు. ‘‘నేనడిగింది జైలుకి కొత్తా అని.’’ ‘‘అవును. ఏం?’’ ‘‘అది బాస్ టాయ్‌లెట్. ఆయన తప్ప అందులోకి ఇంకెవరూ వెళ్ళకూడదు’’ ఒకడు చెప్పాడు. ‘జైళ్ళల్లో కూడా టాయ్‌లెట్స్‌కి రిజర్వేషన్లు ఉన్నాయని నాకు తెలీదు’’ వానర్ గొణిగాడు. ‘‘ఇది కులం రిజర్వేషన్ కాదు. మా బాస్ బలం రిజర్వేషన్.’’ ‘‘ఎవడా బాస్’’ ‘‘నేనే’’ దుర్యోధన్ కఠినంగా చూస్తూ చెప్పాడు. ‘‘మా బాస్ ఏం నేరం చేసి వచ్చాడో తెలుసా? హత్యలు. ఒకటి కాదు. రెండు’’ రెండో వాడు చెప్పాడు. ‘‘మూడో హత్య చెయ్యడానికి వెనుకాడను. ఎన్నిసార్లు చేసినా ఉరి పడేది ఒక్కసారే.’’ దుర్యోధన్ తన అనుచరుడు అందించిన స్ప్రింగ్ కత్తి మీట నొక్కి, విప్పి దాన్ని వానర్ గొంతుకి ఆనించి చెప్పాడు. ‘‘వాడ్నేం అనకండి. వాడితో ప్రమాదం’’ కపీష్ అడ్డు చెప్పాడు. ‘‘ఏం? నన్ను మించినవాడా?’’ దుర్యోధన్ కోపంగా అడిగాడు. ‘‘అది కాదు...’’ ‘‘నాతో అంతకన్నా ప్రమాదం’’ దుర్యోధన్ చెప్పాడు. తక్షణం వానర్ చుట్టూ నేల మీద మడుగు కట్టింది. ‘‘అనుకున్నంతా ఐంది... వాడితో ఏం ప్రమాదమో, అదిగో అటు చూడండి. తెలుస్తుంది’’ కపీష్ ఆ మడుగుని చూపించాడు. ‘‘ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుందో?’’ క్యూలో ఉన్న వానర్ పళ్ళేన్ని అందుకుంటూ దిగులుగా చెప్పాడు. తర్వాత టిఫిన్ వడ్డించే అతని దగ్గరకి చేరుకుని పళ్ళేన్ని ముందుకి చాపాడు. అతను ద్రవాన్ని ఓ కప్పులో పోశాడు. ‘‘ఇది టీనా?’’ కపీష్ వాసన చూసి అడిగాడు. ‘‘కిరసనాయిలు వాసన వేస్తోందా?’’ ‘‘అవును.’’ ‘‘ఐతే కాఫీ. టీ ఫినాయిల్ వాసన వేస్తుంది.’’ మరో కారే ద్రవాన్ని ప్లేట్లో పోశారు. ‘‘ఇదేమిటి? ఎప్పుడూ ఇలాంటి టిఫిన్ ఎప్పుడూ చూడలేదు’’ అడిగాడు. ‘‘రెండు ఇడ్లీలు.’’ ‘‘చట్నీ ఏమో? ఇడ్లీ వేయండి’’ వానర్ కోరాడు. ‘‘ఏం? పిండి సరిగ్గా ఉడకనంత మాత్రాన వెటకారమా? వెళ్ళు.’’ ‘‘చట్నీ?’’ ‘‘రిమాండ్ ఖైదీలకి చట్నీ వేయం. శిక్ష ఖరారైన వారికే వేస్తాం.’’ ‘‘స్పూన్లు ఏవీ?’’ -
త్రీమంకీస్ - 10
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 10 చాలామంది యమధర్మరాజుతో కరచాలనం చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఆయన చిరునవ్వుతో అందరికీ ‘థాంక్యూ, ‘థాంక్యూ’ అని జవాబు చెప్తున్నాడు. ఓ మహిళ శవం ఓ వైపు నేల మీది చాప మీద పడుకోపెట్టి ఉంది. ఆవిడ చేతిలోని సెల్ ఫోన్ చెవి దగ్గర ఆనించి ఉంది. సెల్‌ఫోన్ గుప్పెట్లో బిగిసిపోవడంతో ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆ మహోత్సవాన్ని ఫొటోలు, వీడియో తీసే ఒకతను ఇంకొకరికి చెప్పడం ముద్దాయి విన్నాడు. ‘‘నేను ఫొటోగ్రఫీని ఎందుకు హాబీగా చేసుకున్నానంటే, నేను ద్వేషించే వారిని షూట్ చేసి, జైలుకి వెళ్ళకుండా వారి తలలు కట్ చేయగలను కాబట్టి.’’ సీఐ యమధర్మరాజు దగ్గరికి నడిచి సెల్యూట్ చేసి చెప్పాడు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆనర్.’’ ‘‘థాంక్యూ. థాంక్యూ’’ ఆయన ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు. ‘‘మీకు తీరిక ఉంటే ఓ ముద్దాయిని రిమాండ్ కోసం తీసుకువచ్చాను యువర్ ఆనర్.’’ ‘‘ఇతనేనా?’’ ఆయన ఆ యువకుడి వంక చూస్తూ అడిగాడు.‘‘అవును యువర్ ఆనర్. నేనే దొంగని.’’ అతను చెప్పాడు. ‘‘పేరు?’’ ‘‘వానర్.’’ ‘‘తండ్రి పేరు?’’ ‘‘కిష్కింధ.’’ ‘‘సోదరుడి పేరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు. ‘‘అయోధ్య.’’ ‘‘రాముడికీ, మీకూ ఏమైనా సంబంధం ఉందా?’’ ‘‘ఉంది యువర్ ఆనర్. మా నాన్న సీతారామకళ్యాణం నడిచే సినిమా హాల్లో కర్టెన్లని లాగేవాడు.’’ సీఐ ఇచ్చిన స్టేట్మెంట్ని చదివి అడిగాడు. ‘‘దీని మీద సంతకం నీదేనా?’’ ‘‘నాదే యువరానర్. అది చేసి అరగంటైంది. సిఐ గారికి తొందరెక్కువ సార్. ‘తొందర లేదు. ఆగుదాం’ అన్నా తీసుకొచ్చేశారు’’ వానర్ చెప్పాడు. ‘‘నిన్ను జైలుకి కస్టడీకి పంపిస్తున్నాను. చెప్పుకోడానికి ఏమైనా ఉందా?’’ ‘‘నాక్కావాల్సింది జైలు కాదు. బెయిల్.’’ ‘‘నీకు జీవితంలో మంచి మిత్రుడు ఉన్నాడో లేడో రేపటి కల్లా తెలుసుకోవచ్చు.’’ ఆయన నవ్వుతూ చెప్పాడు. ‘‘ఎన్ని రోజులు రాసుకోను సార్?’’ సీఐ ప్రశ్నించాడు. ‘‘రాసుకో ఓ నాలుగు రోజులు.’’ ‘‘థాంక్యూ సర్. పాపం. మీ ఆవిడ పోయినందుకు మీకు నా సానుభూతి యువర్ ఆనర్’’ వానర్ చెప్పాడు. యమధర్మరాజు అతని వంక కోపంగా చూసి చెప్పాడు. ‘‘ప్లన్ మూడు. ఏడు రోజులు రాయి.’’ తర్వాత అతని టీ షర్ట్ మీద పదాలని చదివాడు. ‘ఐ కెన్ ఓన్లీ ప్లీజ్ ఒన్ పర్సన్ పర్ డే. టు డే ఈజ్ నాట్ యువర్ డే’ ‘‘ప్లస్ నాలుగు. పదకొండు రోజులు రాసుకో’’ యమధర్మరాజు మళ్ళీ చెప్పాడు. ‘‘ఎస్సార్.’’ ‘‘భార్య పోతే ఏమిటి ఈయనకి ఇంత ఆనందం?’’ వానర్ వేన్లో సీఐని అడిగాడు. ‘‘నీకు పెళ్ళి కాలేదా?’’ ‘‘కాలేదు సార్.’’ ‘‘అందుకే తెలీలేదు.’’ ‘‘ఏమిటి ఇవాళ ఇంత మందిని తెస్తున్నారు?’’ జైలర్ వానర్ని ఎగాదిగా చూసి ిసీఐని అడిగాడు. ‘‘వాతావరణం వేడిగా ఉంది కదండి.’’ వాతావరణం నలభై డిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నేరాలు అధికంగా జరుగుతాయన్నది పోలీస్ శాఖలో పని చేేన సీఐ అనుభవం. పోలీసులకి వానర్ ఇచ్చిన స్టేట్మెంట్ని చదివి జైలర్ అడిగాడు. ‘‘ఇది నీ సంతకమేగా?’’ ‘‘అవునండి. నేను దాన్ని ఫోర్జరీ చేయలేదండి’’ వానర్ జవాబు చెప్పాడు. ‘‘నిన్నెక్కడో చూసినట్లుంది?’’ ‘‘టివిలో చూసి ఉంటారు సార్.’’ ‘‘టివి ఏక్టర్వా?’’ ‘‘కాదు సార్. హిజ్రా అసోసియేషన్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం వారానికి నాలుగు గంటలు ఛారిటీ వర్క్ చేస్తూంటాను.’’ ‘‘నీ పేరు?’’ ‘‘వానర్.’’ జైలర్ ఉలిక్కిపడి సిఐని చూసి అడిగాడు. ‘‘ఇవాళ వరసగా కోతుల్ని పట్టుకొస్తున్నారేమిటి?’’ ‘‘ప్రజలు ఒకప్పుడు వెరైటీ పేర్ల కోసం తెగ ఇదైపోయేవారండి. ఈ రోజుల్లో ఎవరికీ లేని కొత్త పేర్ల కోసం ఇదవుతున్నారు. మా అన్నయ్య కొడుక్కి మృగ్ అనే పేరు పెట్టారు’’ ిసీఐ వివరించాడు. ‘‘పాపం! నీ వయసెంతో?’’ జైలర్ అడిగాడు. ‘‘నలభై రెండు సార్’’ సీఐ వెంటనే చెప్పాడు. ‘‘నీది కాదు. నీది’’ వానర్ వంక వేలితో చూపించాడు. ‘‘ఈయన వయసుకి పంతొమ్మిది తక్కువ సార్.’’ ‘‘నేను ఇంజనీరింగ్ చదవలేదు. లెక్కలు సరిగ్గా రావు. నీ వయసెంతో సూటిగా చెప్పు.’’ ‘‘ఇరవై మూడు సార్.’’ ‘‘నువ్వు కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షనా?’’ ‘‘అవును సార్.’’ ‘‘ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో?’’ ‘‘ఎయిటీ ఫైవ్ సర్.’’ ‘‘ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేశావా?’’ ‘‘చేసాను సార్.’’ ‘‘మరి దాంట్లో ఎందుకు చేరలేదు?’’ ‘‘ఇంటర్వ్యూలో తుస్సుమంది సార్.’’ (వానర్ ఏ మూర్ఖపు పనితో పోలీసుకి పట్టుబడ్డాడు?)