త్రీమంకీస్ -21 | malladi venkatakrishna three monkeys story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -21

Published Sat, Nov 8 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

త్రీమంకీస్  -21

త్రీమంకీస్ -21

మల్లాది వెంకటకృష్ణమూర్తి

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 21
 
‘‘ఆ నాలుగో గాడిద ఏమైంది?’’ జైల్ బాత్‌రూంలోకి వెళ్తూ వానర్ కపీష్‌ని ప్రశ్నించాడు.
‘‘లేదు. నేను మన ఆడిటోరియంలో వదిలింది నాలుగు గాడిదలనే. ఐదిటిని కాదు’’ కపీష్ జవాబు చెప్పాడు.
‘‘ఇంజినీరింగ్ విద్యార్థివై ఉండి, మూడు తర్వాత ఐదు నంబర్ ఎందుకు వేశావు?’’ మర్కట్ అడిగాడు.
‘‘నాలుగో గాడిద కూడా ఉందని దానికోసం వెదుకుతారని.’’

వాళ్ళు పకపక నవ్వుతూ బాత్ రూంలోకి వెళ్ళారు. ఓ బోర్డ్ మీద ‘విమెన్ రైట్’ అని, దానికి కుడి వైపుకి బాణం గుర్తు, ‘మెన్ లెఫ్ట్’ అని ఎడమ వైపుకి బాణం గుర్తు కనిపించాయి. అంతే కాదు. ఇంకో వాక్యం కూడా ఉంది. విమెన్ ఆర్ ఆల్వేస్ రైట్. ముగ్గురూ లోపలకి వెళ్ళారు.
 ‘‘ఈ మధ్య బాగా చదువుకున్న వాళ్ళు జైళ్ళకి వస్తున్నట్లున్నారే’’ గోడ మీది రాతల్ని చూసి కపీష్ చెప్పాడు.  ‘టి సుబ్బారావ్ వజ్ హియర్.’  ‘జైల్లోకి నిరుద్యోగాన్ని ప్రవేశపెట్టలేవు’  ‘నా ఇల్లు జైల్. నా వృత్తి బాత్‌రూంలో గడపటం.’  ‘నువ్వు జైల్లో ఉంటే నీ నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్ళే ములాఖత్‌కి వస్తారు.’  ‘మంచి మిత్రుడు నీకు బెయిల్‌ని ఇప్పిస్తాడు. ఉత్తమ మిత్రుడు నీతో అంత్యాక్షరి ఆడతాడు.’ వాటిని చదివి పెద్దగా నవ్వే ఆ ముగ్గురూ దుర్యోధన్ దృష్టిలో పడ్డారు. అతను వారి వంక అసహనంగా చూశాడు. కపీష్ ఓ టాయ్‌లెట్ కేబిన్‌లోకి వెళ్తూంటే బలాఢ్యులైన ఇద్దరు ఖైదీల్లో ఒకతను అతన్ని ఆపి అడిగాడు. 

‘‘ఏమిటిలా వచ్చావ్?’’

 అదే సినిమా హాల్లో అడిగి ఉంటే, ‘చిల్లర సీట్ల కింద పడిందేమో చూసి ఏరుకోడానికి’ అని, రైల్వే స్టేషన్‌లో ఐతే, ‘రైలుని తోయడానికి వచ్చానని’ చెప్పేవాడు. ఆ ప్రశ్నకి కపీష్‌కి ఏం జవాబు చెప్పాలో తెలీక తెల్లబోయాడు.

 ‘‘కొత్తా?’’

‘‘లేదు. పుట్టినప్పటి నించి బాత్‌రూంకి వెళ్తున్నాడు’’ వానర్ జవాబు చెప్పాడు.
‘‘నేనడిగింది జైలుకి కొత్తా అని.’’
‘‘అవును. ఏం?’’
‘‘అది బాస్ టాయ్‌లెట్. ఆయన తప్ప అందులోకి ఇంకెవరూ వెళ్ళకూడదు’’ ఒకడు చెప్పాడు.
 ‘జైళ్ళల్లో కూడా టాయ్‌లెట్స్‌కి రిజర్వేషన్లు ఉన్నాయని నాకు తెలీదు’’ వానర్ గొణిగాడు.
 ‘‘ఇది కులం రిజర్వేషన్ కాదు. మా బాస్ బలం రిజర్వేషన్.’’
 ‘‘ఎవడా బాస్’’
 ‘‘నేనే’’ దుర్యోధన్ కఠినంగా చూస్తూ చెప్పాడు.
 ‘‘మా బాస్ ఏం నేరం చేసి వచ్చాడో తెలుసా? హత్యలు. ఒకటి కాదు. రెండు’’ రెండో వాడు చెప్పాడు.
 ‘‘మూడో హత్య చెయ్యడానికి వెనుకాడను. ఎన్నిసార్లు చేసినా ఉరి పడేది ఒక్కసారే.’’ దుర్యోధన్ తన అనుచరుడు అందించిన స్ప్రింగ్ కత్తి మీట నొక్కి, విప్పి దాన్ని వానర్ గొంతుకి ఆనించి చెప్పాడు.
 ‘‘వాడ్నేం అనకండి. వాడితో ప్రమాదం’’ కపీష్ అడ్డు చెప్పాడు.
 ‘‘ఏం? నన్ను మించినవాడా?’’ దుర్యోధన్ కోపంగా అడిగాడు.
 ‘‘అది కాదు...’’
 ‘‘నాతో అంతకన్నా ప్రమాదం’’ దుర్యోధన్ చెప్పాడు.
 తక్షణం వానర్ చుట్టూ నేల మీద మడుగు కట్టింది.
 ‘‘అనుకున్నంతా ఐంది... వాడితో ఏం ప్రమాదమో, అదిగో అటు చూడండి. తెలుస్తుంది’’ కపీష్ ఆ మడుగుని చూపించాడు.
 ‘‘ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుందో?’’ క్యూలో ఉన్న వానర్ పళ్ళేన్ని అందుకుంటూ దిగులుగా చెప్పాడు. తర్వాత టిఫిన్ వడ్డించే అతని దగ్గరకి చేరుకుని పళ్ళేన్ని ముందుకి చాపాడు. అతను ద్రవాన్ని ఓ కప్పులో పోశాడు.
‘‘ఇది టీనా?’’ కపీష్ వాసన చూసి అడిగాడు.
‘‘కిరసనాయిలు వాసన వేస్తోందా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఐతే కాఫీ. టీ ఫినాయిల్ వాసన వేస్తుంది.’’
 మరో కారే ద్రవాన్ని ప్లేట్‌లో పోశారు.
 ‘‘ఇదేమిటి? ఎప్పుడూ ఇలాంటి టిఫిన్ ఎప్పుడూ చూడలేదు’’ అడిగాడు.
 ‘‘రెండు ఇడ్లీలు.’’
 ‘‘చట్నీ ఏమో? ఇడ్లీ వేయండి’’ వానర్ కోరాడు.
 ‘‘ఏం? పిండి సరిగ్గా ఉడకనంత మాత్రాన వెటకారమా? వెళ్ళు.’’
 ‘‘చట్నీ?’’
 ‘‘రిమాండ్ ఖైదీలకి చట్నీ వేయం. శిక్ష ఖరారైన వారికే వేస్తాం.’’
 ‘‘స్పూన్‌లు ఏవీ?’’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement