Womens right
-
రుచించని పేరు
మంచి ఉద్దేశంతోనే ఆమె తన హోటల్‌కి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే హోటల్లోని పదార్థాలను ఇష్టపడినంతగా ఆ హోటల్ పేరును స్థానికులు ఆస్వాదించలేకపోయారు. కరెలీన్ కెర్‌కు కష్టకాలం మొదలైంది! పాపం ఆవిడ, చక్కగా నడుస్తున్న తన రెస్టారెంట్‌ను విధిలేని పరిస్థితుల్లో వచ్చేవారం మూసి వేయవలసి వస్తోంది. గత రెండేళ్లుగా ఆమె తన రెస్టారెంట్లో చక్కగా వేయించిన రుచికరమైన చేపముక్కల్ని, కరకరలాడే బంగాళా దుంపల చిప్స్‌ని కస్టమర్స్‌కి సర్వ్ చేస్తూ, పేరుతోపాటు డబ్బునూ గడించారు. ఇప్పుడిక బోర్డు తిప్పేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. మహిళా హక్కుల సంఘాలవారు కరెలీన్ ఆ రెస్టారెంట్‌ను పెట్టినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా గత మూడు నెలల నుంచి ఆ రెస్టారెంట్ పేరుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చివరికి వారి పోరాటం ఫలించి, వెంటనే బోర్డును తొలగించి, వేరే పేరు పెట్టుకోవాలని కోర్టు ఆమెను ఆదేశించింది. దాంతో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న ఆ రెస్టారెంట్ ప్రపంచవ్యాప్తం విశేషం అయింది. కరెలీన్ రెస్టారెంట్ పేరు ‘బ్యాటర్డ్ వైఫ్’. ‘తన్నులు తింటుండే భార్య’ అని ఈ మాటకు అర్థం. రోజూ ఇంట్లో చావుదెబ్బలు తినే ఆడవాళ్లను ఈ బోర్డు పరిహసించేలా ఉందని హక్కుల సంఘాల వాదన. అయితే, ‘‘భర్తల్లో ఆలోచన రేకెత్తించి, వారిలో పరివర్తన తెచ్చేందుకే ఈ పేరు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని’’ కరెలీన్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ హింసపై మూడు నెలల క్రితం విడుదలైన ఒక నివేదిక మహిళా కార్యకర్తల వాదనకు బలం చేకూర్చింది. ఆస్ట్రేలియాలోని ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని నివేదిక సారాంశం. ఇంత జరుగుతుంటే ఒక హోటల్‌కు ఇలాంటి పేరేమిటని మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు, వారి వల్ల ప్రభావితం అయిన నాయకులూ కరెలీన్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. చివరికి అనుకున్నది సాధించారు. వారం లోపు రెస్టారెంట్ పేరు మార్చాలని స్థానిక కోర్టు ఒకటి జారీ చేసిన ఉత్తర్వులు కరెలీన్కు గత మంగళవారం అందాయి. ‘‘నేనెంత దుఃఖంలో ఉన్నానో చెప్పలేను. నా రెస్టారెంట్ పేరును వెంటనే మార్చడం కుదరదు కనుక రెస్టారెంట్‌నే మూసి వేస్తున్నాను. ఇందుకు నన్ను నా కస్టమర్లు క్షమించాలి’’ అని కరెలీన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మన ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. ఆ ఉద్దేశానికి విరుద్ధమైన అర్థం వస్తుంటే కనుక తప్పు మనదే అవుతుంది. -
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తే వాళ్లను తక్కువ చేయడమే
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ ‘‘క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉంది. కేవలం సినీ పరిశ్రమను ఎందుకు నిందిస్తారు? ఇండస్ట్రీ కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది. మిగతా చోట్లల్లా మహిళలను వాడుకొని వదిలేయడం లేదు కదా?’’ అని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సరోజ్ ఖాన్ చేసిన ఈ కామెంట్ కరెక్టేనా? అన్న ప్రశ్నను కమల్ హాసన్ ముందుంచితే ఆయన స్పందిస్తూ– ‘‘నేను ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాస్టింగ్ కౌచ్ మీద కూర్చోవాలా వద్దా? లేకపోతే ఆ కౌచ్‌ని కాళ్లతో తన్నేయాలా అన్నది పూర్తిగా ఆ మహిళ రైట్. కానీ క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ దానికి ఫేవర్‌గా మాట్లాడితే ఇండస్ట్రీలో ఉన్న నా చెల్లెళ్లు, కూతుళ్ల రైట్స్‌ను తగ్గించటమే. వాళ్లను తక్కువ చేయడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. -
త్రీమంకీస్ -21
మల్లాది వెంకటకృష్ణమూర్తి డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 21 ‘‘ఆ నాలుగో గాడిద ఏమైంది?’’ జైల్ బాత్రూంలోకి వెళ్తూ వానర్ కపీష్‌ని ప్రశ్నించాడు. ‘‘లేదు. నేను మన ఆడిటోరియంలో వదిలింది నాలుగు గాడిదలనే. ఐదిటిని కాదు’’ కపీష్ జవాబు చెప్పాడు. ‘‘ఇంజినీరింగ్ విద్యార్థివై ఉండి, మూడు తర్వాత ఐదు నంబర్ ఎందుకు వేశావు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాలుగో గాడిద కూడా ఉందని దానికోసం వెదుకుతారని.’’ వాళ్ళు పకపక నవ్వుతూ బాత్ రూంలోకి వెళ్ళారు. ఓ బోర్డ్ మీద ‘విమెన్ రైట్’ అని, దానికి కుడి వైపుకి బాణం గుర్తు, ‘మెన్ లెఫ్ట్’ అని ఎడమ వైపుకి బాణం గుర్తు కనిపించాయి. అంతే కాదు. ఇంకో వాక్యం కూడా ఉంది. విమెన్ ఆర్ ఆల్వేస్ రైట్. ముగ్గురూ లోపలకి వెళ్ళారు. ‘‘ఈ మధ్య బాగా చదువుకున్న వాళ్ళు జైళ్ళకి వస్తున్నట్లున్నారే’’ గోడ మీది రాతల్ని చూసి కపీష్ చెప్పాడు. ‘టి సుబ్బారావ్ వజ్ హియర్.’ ‘జైల్లోకి నిరుద్యోగాన్ని ప్రవేశపెట్టలేవు’ ‘నా ఇల్లు జైల్. నా వృత్తి బాత్రూంలో గడపటం.’ ‘నువ్వు జైల్లో ఉంటే నీ నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్ళే ములాఖత్‌కి వస్తారు.’ ‘మంచి మిత్రుడు నీకు బెయిల్‌ని ఇప్పిస్తాడు. ఉత్తమ మిత్రుడు నీతో అంత్యాక్షరి ఆడతాడు.’ వాటిని చదివి పెద్దగా నవ్వే ఆ ముగ్గురూ దుర్యోధన్ దృష్టిలో పడ్డారు. అతను వారి వంక అసహనంగా చూశాడు. కపీష్ ఓ టాయ్‌లెట్ కేబిన్‌లోకి వెళ్తూంటే బలాఢ్యులైన ఇద్దరు ఖైదీల్లో ఒకతను అతన్ని ఆపి అడిగాడు. ‘‘ఏమిటిలా వచ్చావ్?’’ అదే సినిమా హాల్లో అడిగి ఉంటే, ‘చిల్లర సీట్ల కింద పడిందేమో చూసి ఏరుకోడానికి’ అని, రైల్వే స్టేషన్లో ఐతే, ‘రైలుని తోయడానికి వచ్చానని’ చెప్పేవాడు. ఆ ప్రశ్నకి కపీష్‌కి ఏం జవాబు చెప్పాలో తెలీక తెల్లబోయాడు. ‘‘కొత్తా?’’ ‘‘లేదు. పుట్టినప్పటి నించి బాత్రూంకి వెళ్తున్నాడు’’ వానర్ జవాబు చెప్పాడు. ‘‘నేనడిగింది జైలుకి కొత్తా అని.’’ ‘‘అవును. ఏం?’’ ‘‘అది బాస్ టాయ్‌లెట్. ఆయన తప్ప అందులోకి ఇంకెవరూ వెళ్ళకూడదు’’ ఒకడు చెప్పాడు. ‘జైళ్ళల్లో కూడా టాయ్‌లెట్స్‌కి రిజర్వేషన్లు ఉన్నాయని నాకు తెలీదు’’ వానర్ గొణిగాడు. ‘‘ఇది కులం రిజర్వేషన్ కాదు. మా బాస్ బలం రిజర్వేషన్.’’ ‘‘ఎవడా బాస్’’ ‘‘నేనే’’ దుర్యోధన్ కఠినంగా చూస్తూ చెప్పాడు. ‘‘మా బాస్ ఏం నేరం చేసి వచ్చాడో తెలుసా? హత్యలు. ఒకటి కాదు. రెండు’’ రెండో వాడు చెప్పాడు. ‘‘మూడో హత్య చెయ్యడానికి వెనుకాడను. ఎన్నిసార్లు చేసినా ఉరి పడేది ఒక్కసారే.’’ దుర్యోధన్ తన అనుచరుడు అందించిన స్ప్రింగ్ కత్తి మీట నొక్కి, విప్పి దాన్ని వానర్ గొంతుకి ఆనించి చెప్పాడు. ‘‘వాడ్నేం అనకండి. వాడితో ప్రమాదం’’ కపీష్ అడ్డు చెప్పాడు. ‘‘ఏం? నన్ను మించినవాడా?’’ దుర్యోధన్ కోపంగా అడిగాడు. ‘‘అది కాదు...’’ ‘‘నాతో అంతకన్నా ప్రమాదం’’ దుర్యోధన్ చెప్పాడు. తక్షణం వానర్ చుట్టూ నేల మీద మడుగు కట్టింది. ‘‘అనుకున్నంతా ఐంది... వాడితో ఏం ప్రమాదమో, అదిగో అటు చూడండి. తెలుస్తుంది’’ కపీష్ ఆ మడుగుని చూపించాడు. ‘‘ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుందో?’’ క్యూలో ఉన్న వానర్ పళ్ళేన్ని అందుకుంటూ దిగులుగా చెప్పాడు. తర్వాత టిఫిన్ వడ్డించే అతని దగ్గరకి చేరుకుని పళ్ళేన్ని ముందుకి చాపాడు. అతను ద్రవాన్ని ఓ కప్పులో పోశాడు. ‘‘ఇది టీనా?’’ కపీష్ వాసన చూసి అడిగాడు. ‘‘కిరసనాయిలు వాసన వేస్తోందా?’’ ‘‘అవును.’’ ‘‘ఐతే కాఫీ. టీ ఫినాయిల్ వాసన వేస్తుంది.’’ మరో కారే ద్రవాన్ని ప్లేట్లో పోశారు. ‘‘ఇదేమిటి? ఎప్పుడూ ఇలాంటి టిఫిన్ ఎప్పుడూ చూడలేదు’’ అడిగాడు. ‘‘రెండు ఇడ్లీలు.’’ ‘‘చట్నీ ఏమో? ఇడ్లీ వేయండి’’ వానర్ కోరాడు. ‘‘ఏం? పిండి సరిగ్గా ఉడకనంత మాత్రాన వెటకారమా? వెళ్ళు.’’ ‘‘చట్నీ?’’ ‘‘రిమాండ్ ఖైదీలకి చట్నీ వేయం. శిక్ష ఖరారైన వారికే వేస్తాం.’’ ‘‘స్పూన్లు ఏవీ?’’