ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని పెంపొందించండి
- ఉద్యానవనాలను అభివృద్ధి చేయండి
- పంచ మఠాలను అందుబాటులోకి తేవాలి
- ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన ఈఓ నారాయణ భరత్గుప్త, దేవాదాయ సీఈ సుబ్బారావు, దేవస్థానం ఇంజినీరింగ్, హార్టికల్చర్ ఏడీ వెంకటరావు, తదితర విభాగాల సిబ్బందితో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా మల్లమ్మతోట, సర్వతోభద్ర వనం, మల్లమ్మకన్నీరు, భ్రామరీ పుష్పవనం, ఘంటామఠం తదితర ప్రదేశాలు, ఉద్యాన వనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లమ్మతోటలో స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యానికి అవసరమైన నందివర్థనం, గరుడ వర్థనం, కనకాంబరం, మల్లె, మందారం, గులాబి, గన్నెరు, బంతి తదితర మొక్కలను పెంచాలని సూచించారు.
పాతాళగంగ మార్గంలోని సర్వతోభద్రవనంలో నర్సరీ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలన్నారు.
మల్లమ్మ కన్నీరు దిగువ భాగాన ఉన్న దాదాపు 2.5 ఎకరాల íవిస్తీర్ణంలో దేవస్థానం నిర్వహిస్తున్న భ్రామరీ పుష్పవనంలో స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యానికి పుష్పాలను పెంచాలని సూచించారు.
అరుదైన వృక్ష జాతులు, దేవతా వృక్షాలు, మొక్కల పెంపకం తదితర వాటిపై భక్తులలో అవగాహన కల్పించేందుకు క్షేత్రంలోని వృక్షవనాన్ని (బొటానికల్ గార్డెన్) ఏర్పాటు చేయాలని చెప్పారు.
భక్తులు ఆయా ఉద్యానవనాలను వీక్షించేందుకు నడక దారులను ఏర్పాటు చేయాలని, దేవస్థానం నర్సరీల మొక్కల గురించి, దేవతా వృక్షాలపై భక్తులు, యాత్రికులలో అవగాహన కల్పించే విధంగా సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రతి ఉద్యానవనంలో పశువుల పేడతో సహజసిద్ధమైన ఎరువు తయారీకి చర్యలు చేపట్టాలన్నారు.
ఉద్యానవనాలను అవసరమైన మేర నీటిసరఫరాకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం ఆయన ఘంటామఠ ం పునర్నిర్మాణాన్ని పరిశీలించారు. క్షేత్రంలోని పంచమఠాల పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేసి వీటన్నింటిని కలుపుతూ అనుసంధాన కాలిబాటలు ఏర్పాటు చేసి భక్తులందరికీ పంచమఠాలను క్రమపద్ధతిలో దర్శించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.