పేదలకు వరం రచ్చబండ
పుల్కల్, న్యూస్‌లైన్: రచ్చబండ కార్యక్రమం పేదలకు వరమని పుల్కల్ మాజీ జడ్పీటీసీ మల్లప్ప అన్నారు. పుల్కల్ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో మంగళవారం జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే రచ్చబండ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామస్థాయిలోని ప్రతి పేదవాని ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. మండలానికి ఇప్పటికే సుమారు 9 వందల కోట్లను డిప్యూటీ సీఎం మంజూరు చేశారన్నారు. సింగూర్ కాలువకు 99కోట్లు, సుల్తాన్పూర్ జేఎన్టీయూకు 3 వందల కోట్లు, సింగూర్ బ్రిడ్జి , గ్రామీణ రోడ్లు, ప్రభూత్వ భవనాలు, మురికి కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి డిప్యూటి సీఎం నిధులు మంజూరు చేయించారన్నారు. ప్రతి గ్రామంలో తాగు నీటి సమస్య లేకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయితీలకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయన్నారు.
సీఎం ఫ్లెక్సీ తొలిగించాల్సిందే
రచ్చ బండ కార్యక్రమం ప్రారంభంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఫ్లెక్సీపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాన్ని తొలగించాలని పట్టుబట్టారు.
దీంతో చేసేదిలేక జేసీ శరత్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే స్టేజీ దిగి వెళ్లిపోయారు.
రచ్చబండలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి
రచ్చబండ కార్యక్రమం వల్ల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని మండల స్పెషలాఫీసర్ ఉషామార్తా పేర్కొన్నారు. మండలంలో 972 పింఛన్లు, 332 రేషన్ కార్డులు, 11 వందల 53 ఇండ్లు మంజూరయ్యాయని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద విద్యుత్ వినియోగదారులకు రూ. కోటి 10 లక్షల53 వేలు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.