mallapuram
-
కాళేశ్వరం సొరంగంలో మరో ప్రమాదం
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం బండరాళ్లు మీదపడి ఓ కూలీ మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ప్రాజెక్ట్ సొరంగంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో అసోంకు చెందిన దేవజిత్ అనే కూలీ మృతి చెందాడు. కాగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్ మార్గంలో పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. -
గొర్రెను చంపిన చిరుత
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో నల్లప్ప అనే రైతుకు చెందిన గొర్రెను ఓ చిరుత గురువారం చంపేసింది. కళ్యాణదుర్గం సమీపంలోని వన్నూరుస్వామి కొండ వెనుక భాగంలో ఈ ఘటన జరిగింది. గొర్రెలను మేపుకుని వచ్చేందుకు కొండ వద్దకు వెళ్లగా అనూహ్యంగా చిరుత మందపై దాడిచేసి గొర్రెను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారిణి రామేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అదే గ్రామానికి చెందిన మరో రైతు గొర్రెను రెండ్రోజుల కిందట చిరుత చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామస్తులతో పాటు పశువుల కాపరులు అటువైపు మందను తోలుకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. -
వైభవంగా సిడిమానోత్సవం
రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో బుధవారం కుంటు మారెమ్మ సిడిమానోత్సవం ఆశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది. తిప్పేస్వామి అనే భక్తుడిని సిడిమానుకు కట్టి చుట్టూ కలియతిప్పారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మల్లాపురం, పల్లేపల్లి, చదం, చదం గొల్లలదొడ్డి, రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు కర్ణాటక ప్రజలు భారీగా తరలివచ్చారు. అమ్మ వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందచేశారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు
హిందూపురం అర్బన్ / గోరంట్ల : గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఏపీ02 టీడీ 0667 నంబరు హిందూపురం డిపో ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి హిందూపురం వస్తోంది. ఈక్రమంలో మల్లాపల్లి సమీపంలో జెడ్ టర్నింగ్ రైట్ సైడ్ తిప్పుతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో డ్రైవర్ అశ్వర్థ బస్సును అదుపు చేసే లోపు బోల్తా పడింది. ప్రమాదంలో కర్ణాటక ఆదినారాయణకొండ సోమిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మినారాయణ, మల్లాపల్లికి చెందిన లక్ష్మిదేవి, నరసింహులు, తిరుపతికి చెందిన రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ వారం రోజుల నుంచి 600 కి లోమీటర్లు రోజూ ఇదే రూట్లో డ్యూటీ చేశారు. వన్మన్ సర్వీస్ కావడంతో తీవ్ర ఒత్తిడికి కూడా గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున వెంటనే డిపో మేనేజర్ గోపినాథ్, యూనియన్ నాయకులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించారు. -
పాలమూరులో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
బ్లాస్టింగ్లతో దద్దరిల్లిన మల్లాపురం
రాయదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : బండరాళ్లను పగులగొట్టేందుకు క్రషర్ నిర్వాహకులు చేసిన బ్లాస్టింగ్‌లధాటికి మల్లాపురం గ్రామం దద్దరిల్లింది. ఇళ్లు బీటలు బారడంతో గ్రామస్తులు సంబంధిత క్రషర్ యూనిట్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. మల్లాపురం సమీపంలోని కొండల్లో సాయిక్రిష్ణ క్రషర్ నిర్వాహకులు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రెండు బోరు బ్లాస్టింగులు చేయడంతో దగ్గరలోని ఇళ్ల గోడలు బీటలు బారాయి. విద్యుత్ సరఫరా బంద్ అయ్యింది. ఈ భారీ పేలుడు ధాటికి టీవీలు, వంట సామగ్రి ధ్వంసమయ్యాయి. పిల్లలు, వృద్ధులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆగ్రహించిన దాదాపు 300 మంది క్రషర్ యూనిట్‌కు వెళ్లి అక్కడున్న లారీలు, షెడ్లు, మిషన్లను ధ్వంసం చేశారు. కషర్ నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. గతంలో కూడా బ్లాస్టింగ్ల ధాటికి దాదాపు వందల ఇళ్లు దెబ్బతిన్నాయని బాధితులు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడబోమని నిర్వాహకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ బ్లాస్టింగ్‌లకు పాల్పడినందునే తాము క్రషర్‌పై దాడికి దిగాల్సి వచ్చిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. శనివారం ఉదయం క్రషర్ నిర్వాహకులను పిలిపించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాఘవరెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.