మస్తాన్‌బాబు బతికుంటే...
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు, ధైర్యసాహసాలకు నెలవు. అందుకు నిలువెత్తు సాక్ష్యం మస్తాన్‌బాబు.
‘‘నా లాంటి ఎంతోమంది పర్వతారోహకులకు గురువు, స్నేహితుడైన మల్లి మస్తాన్‌బాబు అమరుడై అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు’’ అంటూ బరువెక్కిన హృదయంతో పర్వతారోహకురాలు నాన్సీ బెంట్లీ అన్నారు. మస్తాన్‌బాబు బతికుంటే ఏప్రిల్ 26న కంచన్గంగ పర్వతారోహణకు బయల్దేరవలసిన వాళ్లం అని చెప్పారు. మస్తాన్‌బాబుతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు.
మస్తాన్‌బాబుతో మీకెలా పరిచయం అయింది?
ఉత్తర అమెరికా ఓరిగాన్ రాష్ట్రంలోని పోర్ట్లాండ్ పట్టణం నా జన్మస్థలం. పర్వతారోహణ చేయాలన్నది నా లక్ష్యం. 2010 పోర్ట్లాండ్ మౌంటెనీరింగ్‌పై ఓ వ్యక్తి సందేశం ఇవ్వడానికి వస్తున్నాడని తెలిసింది. వెంటనే మౌంటెనీరింగ్ క్లబ్లో జరుగుతున్న ఆ సమావేశానికి వెళ్లాను. స్టేజ్‌పై ఎక్కే సమయంలో తాను భారతీయుడినని, తన పట్టుదలే లక్ష్యసాధనకు చోదకశక్తి అని చెబుతూంటే ఏదో అనుకున్నాను. తర్వాత, 172 రోజుల్లో 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తీరు మస్తాన్‌బాబు మాటల్లో వింటుంటే ఎక్కడలేని నూతనోత్సాహం నాలో కలిగింది. సందేశం మరో నిమిషంలో పూర్తవుతుందనగానే ఆ సమావేశమందిరమంతా హ్యాట్సాఫ్ టు మస్తాన్‌బాబు అన్న మాటలతో మార్మోగింది. ఎంతోమంది పెద్దలు మస్తాన్‌బాబును గుండెకు హత్తుకున్నారు. మూడు పదుల వయస్సు కలిగిన ఓ వ్యక్తిని నా గురువుగా ఆరుపదుల వయస్సులో ఎంచుకున్నాను. అలా ఆయనతో నా తొలిపరిచయం జరిగింది.
మస్తాన్‌బాబుతో కలిసి మీరు పర్వతారోహణ చేశారా?
చేశాను. మొదట నేను 2010లో నేపాల్‌లో ట్రెక్కింగ్ చేశాను. తర్వాత రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని మస్తాన్‌బాబుతో కలిసి అధిరోహించాను. శీతాకాలంలో పర్వతారోహణ కష్ట సాధ్యం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అది ప్రాణాంతకమైన సాహసం కూడా. ఎల్బ్రోస్ పర్వతారోహణ చేసే సమయంలో మేము వేసుకున్న గుడారంలోకి మంచు వడగండ్లు వచ్చేశాయి. ఎంతో భయపడ్డాను. అయితే మస్తాన్‌బాబు ధైర్యంతో ముందడుగు వేయించారు. నాలుగురోజుల్లోనే పర్వతారోహణ చేసి తిరిగి వచ్చాము. అగ్ని పర్వతారోహణను కూడా చేశాము.
మస్తాన్‌బాబు పర్వతారోహణ విధానం ఎలా ఉంటుంది ?
నలుగురూ వెళ్లే దారిన మస్తాన్‌బాబు వెళ్లరు. పర్వతారోహణను సులువుగా చేయాలన్న విషయంపై తొలుత పక్కా ప్రణాళిక తయారుచేసుకుంటారు. దానికి తగిన విధంగా సమయాన్ని కేటాయిస్తారు. సాధారణంగా చేసేదానికన్నా మస్తాన్‌బాబు ప్రణాళిక ప్రకారం వెళితే పర్వతారోహణ చాలా సులువుగా ఉంటుంది. అనుకున్నది సమయానికి పూర్తి చేయగలుగుతాం.మస్తాన్‌బాబు అనుకున్న సమయానికి పర్వతారోహణ చేసి తీరాల్సిందేనని అంటారు. ముందుకు సాగితే ఆగేది లేదని పూర్తి చేస్తారు. ఆయనలో ధైర్యం, ఆత్మస్థైర్యం, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఆయన ఎంతోమంది పర్వతారోహకులకు ఆదర్శం.
మస్తాన్‌బాబుతో కలిసి మరేమైనా పర్వతారోహణలు చేయాలని సంకల్పించారా ?
ఈ ఏప్రిల్ 26వ తేదీన 30మందితో కలిసి కంచన్గంగ పర్వతారోహణ చేయాలని అనుకున్నాం. నేపాల్‌లో రెండో ఎతై ్తన పర్వతమిది. మొదటి పర్వతం ఎవరెస్ట్‌ను మస్తాన్‌బాబు అధిరోహించిన విషయం తెలిసిందే కదా. దీనిలో నేను ఒక సభ్యురాలిని. అయితే పర్వతారోహణలో తీసుకోవాల్సిన మెళకువలపై మస్తాన్‌బాబు కొన్ని సూచనలు చేశారు. అప్పట్నుంచి విజయవాడలో మంతెన సత్యనారాయణ యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్నాను.
మార్చి 16 నుంచి ఏప్రిల్ పదహారు వరకు శిక్షణ తీసుకోవాలని భారతదేశానికి వచ్చాను. ఇంతలోనే పర్వతారోహణ చేస్తూ మస్తాన్ బాబు అదృశ్యమయ్యాడని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. వాతావరణం సహకరించకపోయినా, ఆహారపు అలవాట్లను సైతం మార్చుకుని నెల రోజులుగా మస్తాన్‌బాబు చివరిచూపు కోసం నిరీక్షించాను.
మస్తాన్‌బాబు వ్యక్తిత్వం గురించి...
మస్తాన్‌బాబు ఓ లెజెండ్. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు, ధైర్యసాహసాలకు, నెలవు. అందుకు నిలువెత్తు సాక్ష్యం మస్తాన్‌బాబు. యావత్ ప్రపంచం మస్తాన్‌బాబును అక్కున చేర్చుకుంది. తగిన గుర్తింపు నిచ్చింది.
మస్తాన్‌బాబు భారతదేశంలో పుట్టడం దేశ ం చేసుకున్న అదృష్టం. మస్తాన్‌బాబును కన్న తల్లి సుబ్బమ్మ జీవితం ధన్యం. ఇప్పటికైనా మస్తాన్‌బాబుకు భారతప్రభుత్వం తగిన గుర్తింపు నివ్వాలి.
...::: గడ్డం హరిబాబు, సాక్షి, సంగం