
'మల్లి' మళ్లీ వస్తాడు...
నెల్లూరు : సాహసమే ఊపిరిగా జీవించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ..మళ్లీ తిరిగి పుడతాడని భావిస్తున్నానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఉదయం మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ...మల్లి మస్తాన్ బాబు స్మృతులను గుర్తు చేసుకున్నారు. మస్తాన్ బాబు అదృశ్యమైన దగ్గర నుంచి ఆతని ఆచూకీ కోసం తీవ్రప్రయాత్నాలు చేశామని, అయినప్పటికీ ప్రాణాలతో కనుగొనలేకపోవటం దురదృష్టకరమన్నారు.
ఉన్నత విద్యను అభ్యసించి... ఉద్యోగాన్ని సైతం వదులుకుని తనకు ఇష్టమైన పర్వతారోహణను చేపట్టి ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ రికార్డును అధిగమించాడన్నారు. తాను తొలిసారి 2006లో మల్లి మస్తాన్ బాబును చూసానని అన్నారు. మల్లి మస్తాన్ బాబును యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మస్తాన్ జీవితం యువతకు ఆదర్శమన్నారు.
మరోవైపు మల్లి మస్తాన్ బాబు స్వగ్రామం గాంధీజనసంగంలో అంత్యక్రియులు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రులు నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు మస్తాన్ బాబు భౌతికకాయానికి అంజలి ఘటించారు. మరోవైపు మస్తాన్ బాబును కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.