రవికుమార్ నర్రాకు పద్మశ్రీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో రాష్ట్రానికి చెందిన రవి కుమార్ నర్రాతో పాటు అయిదుగురు పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర చాప్టర్‌కి రవి కుమార్ నర్రా ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అటు, మరో దళిత పారిశ్రామిక దిగ్గజం రాజేశ్ సరాయా సహా ప్రతాప్ గోవిందరావ్ పవార్, మల్లికా శ్రీనివాసన్, అశోక్ కుమార్ మాగో పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ప్రతాప్ గోవిందరావు పవార్ కేంద్ర మంత్రి శరద్ పవార్‌కి సోదరుడు.
ఆయన సకల్ మీడియా గ్రూప్‌కి, అజయ్ మెటాకెమ్ గ్రూప్‌కి చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 1.6 బిలియన్ డాలర్ల టాఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) సంస్థకి మల్లికా శ్రీనివాసన్ చైర్మన్‌గా ఉన్నారు. టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ సతీమణి మల్లికా. ఇక రాజేశ్ సరాయా బహుళ జాతి మెటల్స్ దిగ్గజం స్టీల్ మాంట్ ట్రేడిం గ్ని నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ అందుకోనున్న మరో దిగ్గజం అశోక్ కుమార్ మాగో.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మాగో అండ్ అసోసియేట్స్‌కి చైర్మన్‌గా ఉన్నారు.
దళిత పారిశ్రామికవేత్తలకిచ్చిన గుర్తింపు: నర్రా
పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా తనను సంప్రతించిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో నర్రా రవికుమార్ మాట్లాడారు. ఈ పురస్కారాన్ని దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానంటూ... ‘‘దళితులు కేవలం రిజర్వేషన్లకే పరిమితం గాకుండా తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపార రంగంలో కూడా రాణించగలరు. దేశం సమ్మిళిత వృద్ధి సాధించాలంటే దళితులను కూడా అందులో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది.
అమెరికాలో ఎలాగైతే బ్లాక్ క్యాపిటలిజానికి ప్రోత్సాహం లభించిందో దేశీయంగా కూడా దళిత క్యాపిటలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అప్పుడే దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది.’’ అని వ్యాఖ్యానించారు.