విద్యార్థినుల పట్ల వెకిలిచేష్టలు
- మొన్న ఎంఈఓ.. నేడు ఉపాధ్యాయుడు
హిందూపురం అర్బన్ : పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గురువు స్థానానికి కలంకం తెస్తున్నారు. ఇటీవల ఎంఈఓ ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలుపాలయ్యారు. ఆ ఉదంతం మరవకముందే మంగళవారం మోడల్కాలనీలో సర్థార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు మల్లికార్జున నాయక్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం స్కూల్ కమిటీ సమావేశం జరుగుతుండటంతో అక్కడికి బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు.
వీరి రాకను ముందుగానే పసిగట్టిన సదరు ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలు చేస్తూ ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో స్కూలుకు వచ్చి విచారణ చేశారు. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ మధుభూషణ్ చెప్పారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.