మాల్యా లగ్జరీ కార్లకు రూ.1.40లక్షలే..
సాక్షి, బెంగళూరు: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దర్జాగా బతుకుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులు ఒక్కొక్కటి వేలానికి వస్తున్నాయి. వేలానికి వచ్చిన ఆయన రెండు లగ్జరీ కార్లను హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త కారు చౌకగా సొంతం చేసుకున్నారు. దాదాపు 34 లక్షలు విలువ చేసే రెండు కార్లను ముంబై నుంచి ఆన్లైన్ నిర్వహించిన వేలంలో రూ.1.4 లక్షలకే హనుమంత రెడ్డి కొనుగోలు చేశారు. మాల్యా వాడిన హ్యుందాయ్ సోనాటో గోల్డ్, హోండా ఎకార్డ్లను తన సొంతం చేసుకున్నట్టు హనుమంతి రెడ్డి తెలిపారు.
సోనాటో గోల్డ్‌ను రూ.40 వేలకు, ఎకార్డ్‌ను లక్షకే కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. 12.5శాతం వ్యాట్‌లతో కలిపి మొత్తంగా రూ.1.58 లక్షలను ఈ కార్లకు చెల్లించినట్టు ఈ వ్యాపారవేత్త చెప్పారు. ఏప్రిల్ నెలలోనే ఈ కార్లను తను పొందినట్టు కూడా తెలిపారు. సోనాటో గోల్డ్ మార్కెట్ ధర రూ. 13.15 లక్షలు. హోండా ఎకార్డ్ ధర రూ.21 లక్షలు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ కార్లు మంచి కండీషన్లో ఉన్నాయని హనుమంత రెడ్డి తెలిపారు. సోనాటా 2002 మోడల్‌కు చెందినది కాగ, ఎకార్డ్ 2003కు చెందిన మోడల్.