ఫలితాలు ఇప్పుడే విడుదల చేయలేం
న్యూఢిల్లీ : ఓ వైపు యజమాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు యూనిటైడ్ బేవరీస్ హోల్డింగ్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) ఆర్థిక సంవత్సర ఫలితాల విడుదల చేయలేమంటోంది. తమ గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా కేసుల నేపథ్యంలో ఫలితాల విడుదలకు తమకు జూలై వరకు గడువు కావాలని కోరుతోంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిటడ్ ఫలితాలను మే 31న విడుదలచేయాల్సి ఉంది. యూబీహెచ్ఎల్ గ్రూప్ లో ఒకటైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగొట్టిన సంగతి తెలిసిందే. వీటికి చైర్మన్ గా ఉన్న విజయ్ మాల్యా తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్నారు.
అయితే కన్సార్టియం అధినేతగా ఉన్న ఎస్ బీఐకు సెటిల్ మెంట్ ఆఫర్ ను విజయ్ మాల్యా ప్రకటించి, సుప్రీంకోర్టు ముందు ఉంచినట్టు తన లేఖలో పేర్కొంది. వాయిదాల రూపంలో రుణాలను చెల్లిస్తామని ప్రకటించిన ఈ సెటిల్ మెంట్ ఆఫర్ ను ఎస్ బీఐ తిరస్కరించింది. మొత్తం రుణాలను వెంటనే చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై ఏప్రిల్ 26న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యూనల్ కు ఈ కేసును బదలాయించింది. రెండు నెలల్లో ఈ సెటిల్ మెంట్ ఆఫర్ పై ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించింది. దీనిపై మొదటి విచారణ జూన్ 2న జరుగనుంది. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదలచేయలేమని, 60రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తామని యూబీహెచ్ఎల్ అభ్యర్థిస్తోంది. అయితే సెబీ నిబంధనల మేరకు ప్రతి కంపెనీ ఆర్థికసంవత్సరం(మార్చి30కి) ముగిసిన 60రోజుల వ్యవధిలోనే వాటి ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది.