మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్‌లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం.
మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు..
మల్యాల.. మెరిసేనిలా
గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట
సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
చక్రాపూర్కు చక్కని గుర్తింపు
గ్రామం: చక్రాపూర్
జిల్లా: మహబూబ్‌నగర్
మూసాపేట(మహబూబ్‌నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్‌లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మిట్టపల్లి.. మిలమిల
గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట
సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది.
రుయ్యాడి.. ఐక్యత దండి
గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్
తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు.
ధర్మారం.. పనితీరులో బంగారం
మండలం: ధర్మారం (మండల పరిషత్),
జిల్లా: పెద్దపల్లి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్‌కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది.
సుందిల్ల.. డబుల్ ధమాకా
గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది.
కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా..
మండలం: కోరుట్ల (మండల పరిషత్)
జిల్లా: జగిత్యాల
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్‌కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది.
పిల్లల అభివృద్ధి.. వికాసం
గ్రామం: మోహినికుంట,
జిల్లా: రాజన్న సిరిసిల్ల
ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు.
‘సిరి’దాస్‌నగర్
గ్రామం: హరిదాస్‌నగర్
జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్‌నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి.
పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి
గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్
తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది.
పాలనలో భేష్.. సంగారెడ్డి
జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్)
సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్‌కు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది.