గ్రామస్థుల దాడిలో గాయపడిన వ్యక్తులు
కృష్ణాజిల్లా తిరువూరు మండలం మల్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు చితకబాదారు. ఆ దాడిలో సదరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. దాంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ ముగ్గురని తిరువురు ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల గ్రామంలో ఇటీవల స్త్రీలు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో చనిపోతున్నారు.
ఆ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, చిన్నమ్మ, రెడ్డప్పలు చేతబడి చేస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని గ్రామస్థులు భావించారు. దాంతో గత అర్థరాత్రి ఉరి చివర ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని... ఊరిలోకి తీసుకువచ్చారు. అనంతరం గ్రామస్థులు వారిని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఆ దాడిలో వారు తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు.