mamidipalli
-
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
తల్లి మందలించిందని..
కిరోసిన్ పోసుకుని బాలిక ఆత్మహత్య శోకసంద్రంలో మామిడిపల్లి గ్రామం మామిడిపల్లి (శంగవరపుకోట రూరల్) : ఆటలాడుకోవద్దని మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మామిడిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్.కోట ఎస్సై కె.రవికుమార్ తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. శంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామంలోని కాలనీకి చెందిన పోలిపల్లి ప్రీతి (14) ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి సమీపాన తోటి పిల్లలతో ఆడుకుంటున్న ప్రీతిని ఎంతసేపూ ఆటలేనా.. వెళ్లి చదువుకో అని తల్లి మందలించడంతో›ప్రీతి ఇంటికెళ్లిపోయింది. అయితే తల్లి మందలింపుతో మనస్తాపం చెందిన ప్రీతి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి మేడపైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మేడపైనుంచి మంటలు రావడంతో సమీపంలో వినాయక మంటపం వద్దనున్న యువకులు చూసి కేకలు వేయడంతో అందరూ మేడపైకి వెళ్లి మంటలార్పారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికను 108 వాహనంలో విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలిచంగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మతి చెందింది. బాలిక తల్లి రాము ఫిర్యాదు మేరకు ఎస్సై కె. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుందని పలువురు అంటున్నారు. బాలిక మతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులను సర్పంచ్ గంగాభవానీ, తదితరులు పరామర్శించారు. -
పాముకాటుతో మహిళ కన్నుమూత
సాలూరు రూరల్ : మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మి (30) పాముకాటుతో మరణించింది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి సోమవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మతురాలికి భర్త వెంకటరావు, ఇద్దరు కుమారులున్నారు. -
రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు
నందిపేట, న్యూస్‌లైన్:నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ చౌరస్తా వద్ద ఎన్నికలలో భాగంగా చేపట్టిన తనిఖీలలో రూ.2 లక్షల నగ దు, 54 క్వాటరు సీసాల మద్యాన్ని గురువారం అధికారులు పట్టుకున్నారు. నందిపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షల నగదు లభించాయి. డబ్బులకు సంబంధించి ఆ వ్యక్తి సరైన ఆధారాలు చూ పించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌లోని రిటర్నింగ్ అధికారి జె.గజ్జెన్నకు అందజేశారు. అలాగే బస్సులో 39 రాయల్ లైఫ్, 15 ఆఫీసర్ చాయిస్ క్వాటరు సీసాలను అధికారులు పట్టుకున్నారు. మామిడిపల్లి వద్ద రూ 1.50 లక్షలు.. ఆర్మూర్ అర్బన్ : మండలంలోని మామిడిపల్లి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.50 లక్షల నగదును పోలీసులు గురువారం జప్తు చేశారు. ఆర్మూర్ ప్రాంతం ఎర్రజొన్న ధాన్యాన్ని లారీల్లో ఢిల్లీ తరలించడానికి ఉమేష్ పాటిల్ అనే వ్యక్తి ఆర్మూర్ వచ్చాడు. ఈ క్రమంలో రూ. 9 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి వాహనాల్లో డీజిల్ పోయించేందుకు అడ్వాన్సులుగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మిగిలిన రూ. 1.50 లక్షల నగదును మామిడిపల్లిలో తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. డబ్బుఆధారాలు లేకపోవడంతో జప్తు చేశారు. చిట్టాపూర్ శివారులో 3.90 లక్షలు.. బాల్కొండ: మండలంలోని చిట్టాపూర్ శివారులో జాతీ య రహదారి-44పై ఎన్నికల ఎస్ఎస్టీ టీం 39, ఫ్లైయిం గ్ టీం డీసీఎం వ్యానులో రూ. 3.90 లక్షల నగదును గురువారం పట్టుకున్నట్లు తహశీల్దార్ పండరినాథ్ తెలిపారు. దత్తాద్రి అనే వ్యక్తి డబ్బులు తీసుకుపోతుండగా ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్ఎస్టీ సమాద్, డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్, ఎంఆర్ఐ సుజాత తనీఖీల్లో పాల్గొన్నారు. లింగంపేటలో రూ. 11.16 లక్షలు.. లింగంపేట: లింగంపేట సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద గురువారం రాత్రి చేపట్టిన తనిఖీలలో రూ.11.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌స్వ్కాడ్ అధికారి అలెగ్జాండర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీటర్ తెలిపారు. పిట్లం నుంచి కామారెడ్డికి వెళ్తున్న వాణి నవశక్తి బీడీ కంపనీ సిబ్బంది డబ్బును తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బం దికి పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్‌చేసి ఆర్డీఓ కార్యాలయానికి తరలిస్తామని అలెగ్జాండర్ తెలిపారు. కామారెడ్డిలో రూ.2 లక్షలు... కామారెడ్డి : కామారెడ్డిలో సిరిసిల్లా రహదారిపై పట్టణ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి వద్ద నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ రూ. 2 లక్షల స్వాధీనం చేసుకున్నారు. కె.గణేశ్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షలు ఉండగా వాటికి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ నాగరాజ్ గౌడ్, ముఖేశ్ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోచారం చెక్‌పోస్టు వద్ద 60 వేలు.. నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం చెక్‌పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అంధోల్ మండలం చింతకుంటకు చెందిన అంబటి హన్మంత్‌రెడ్డి ఇండికా కారులో జోగిపేటకు వెళ్తుండగా పోచారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారులో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు ఆధారాలు చూపించక పోవడంతో అధికారులు సీజ్ చేశారు. యంచ సమీపంలో రూ. 20,35,210 స్వాధీనం నవీపేట : నవీపేట మండలంలోని యంచ గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జి దగ్గర గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా 20 లక్షల 35వేల 210 నగదును పట్టుకున్నారు. కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన పత్తి వ్యాపారులు నాందేడ్‌లో పత్తిని విక్రయించ గా వచ్చిన డబ్బులను తీసుకుని వేర్వేరు వాహనాలలో వస్తుండగా సరిహద్దు ప్రాంతంలో తనిఖీ బృందం ఈ నగదును స్వాధీనం చేసుకుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను తీసుకుని వస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటు ఓచర్లు చూపించారు.కానీ నియమని బంధన ల ప్రకారం ఆ నగదును తనిఖీ బృందం స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. నల్గొండ జిల్లా గుర్రంపూడకు చెందిన వ్యాపారి మల్లారెడ్డి వద్ద 2,91,000,మెదక్ జిల్లాలోని గజ్వేల్‌కు చెందిన ఆంజనేయులు దగ్గర 6,25,810,అదే జిల్లాలోని తొవ్వాటకు చెందిన బాల్ నర్సయ్య దగ్గర 2,90,000,కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు చెందిన మహేష్ దగ్గర 8,28,400 లభ్యమైనట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ తెలిపారు.తనిఖీలో నీటి పారుదల శాఖ ఏఈ రషీద్, డీటీ రమేష్,గిర్దావర్ శ్రీనివాస్,కానిస్టేబుల్ మహబూబ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.