రోదిస్తున్న ప్రీతి కుటుంబ సభ్యులు
కిరోసిన్ పోసుకుని బాలిక ఆత్మహత్య
శోకసంద్రంలో మామిడిపల్లి గ్రామం
మామిడిపల్లి (శంగవరపుకోట రూరల్) : ఆటలాడుకోవద్దని మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మామిడిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్.కోట ఎస్సై కె.రవికుమార్ తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. శంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామంలోని కాలనీకి చెందిన పోలిపల్లి ప్రీతి (14) ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి సమీపాన తోటి పిల్లలతో ఆడుకుంటున్న ప్రీతిని ఎంతసేపూ ఆటలేనా.. వెళ్లి చదువుకో అని తల్లి మందలించడంతో›ప్రీతి ఇంటికెళ్లిపోయింది. అయితే తల్లి మందలింపుతో మనస్తాపం చెందిన ప్రీతి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి మేడపైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మేడపైనుంచి మంటలు రావడంతో సమీపంలో వినాయక మంటపం వద్దనున్న యువకులు చూసి కేకలు వేయడంతో అందరూ మేడపైకి వెళ్లి మంటలార్పారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికను 108 వాహనంలో విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలిచంగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మతి చెందింది. బాలిక తల్లి రాము ఫిర్యాదు మేరకు ఎస్సై కె. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుందని పలువురు అంటున్నారు. బాలిక మతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులను సర్పంచ్ గంగాభవానీ, తదితరులు పరామర్శించారు.