రిజర్వేషన్ అదే.. మళ్లీ పాత కథే!
నవాబుపేట, న్యూస్‌లైన్: అధికారుల తప్పిదం కారణంగా తాము నష్టపోయామంటూ రెండోసారీ మమ్మదాన్‌పల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా గ్రామంలో అసలే లేని ఎస్సీ కులానికి ఏకంగా రిజర్వేషన్ ఖరారు చేయడంపై స్థాని కులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మండలంలోని మమ్మదాన్‌పల్లి పంచాయతీ పరిధిలో 648 మంది ఓట ర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కేవలం బీసీలు మాత్రమే ఉన్నారు. ప్రతీ సర్పం చ్ ఎన్నికల్లో.. ఓసారి బీసీ మహిళకు.. మరోసారి బీసీ జనరల్‌కు రిజర్వేషన్ వస్తూంటుంది. ఇది మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఎన్నికల్లో మా త్రం అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మోమిన్‌పేట నుంచి బతుకుదెరువు కోసం వచ్చి గ్రామంలో ఉంటున్న అనంతయ్య (బీసీ)ని ఎస్సీగా మార్చారు. దీంతో ప్రభుత్వం ఈ పంచాయతీలో రొటేషన్ పద్ధతిలో.. ఇంతవరకూ ఇక్కడ ఎస్సీకి రిజర్వేషన్ కల్పించలేదని గత ఏడాది జూన్‌లో ఆ వర్గానికి రిజర్వుడ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామస్తులు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అయి నా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్తులు గత జూలై నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
రెండోసారీ ఇదే పరిస్థితి..
మొదటిసారి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడంతో మమ్మదాన్‌పల్లిలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. ప్రభుత్వం మళ్లీ ఈ నెల 1న మమ్మదాన్‌పల్లి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా సర్పంచ్ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా అంతకుముందు వ్యక్తికే (ఎస్సీ) రిజర్వేషన్ ఖరారు చేశారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 3 నుంచి సోమవారం వరకు చేపట్టారు. కానీ గ్రామస్తులు... ఎస్సీగా మార్చిన వ్యక్తిగానీ మరెవరూ నామినేషన్లు వేయనివ్వలేదు. రిజర్వేషనలో మార్పు చేయకుండా నోటిఫికేషన్ జారీ చేసినందున తాము రెండోసారి కూడా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మమ్మదాన్‌పల్లి గ్రామస్తులు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకూ ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉంటామని వారు స్పష్టంచేస్తున్నారు. కాగా.. మండలంలోని ఎల్లకొండలోని 8 (జనరల్)వ వార్డుకు 4 నామినేషన్లు దాఖలైనట్టు సోమవారం ఎంపీడీవో ప్రవీణ తెలిపారు.