క్లీన్..గ్రీన్..సేఫ్
కూకట్పల్లి/కేపీహెచ్‌బీ: విశ్వనగరాన్ని నిర్మించడంలో హైదరాబాద్ నగర పౌరులు ప్రభుత్వంతో కలిసి రావాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. నగరాన్ని స్వచ్ఛంగా..పచ్చగా ఉంచడంతోపాటు ప్రజల రక్షణకు పెద్ద పీట వేస్తామన్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పన ద్వారానే విశ్వనగర కల సాకారం అవుతుందన్నారు. ఇప్పటికే అనేక వందల కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పనులు చేపట్టామని తెలిపారు. మరోవైపు ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు అనేక ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని కొలను రాఘవరెడ్డి గార్డెన్స్‌లో జరిగిన ‘మన నగరం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, స్ధానిక సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలపైన పౌరుల స్పందన, సూచనలు, సలహాలను తీసుకుని ప్రభావవంతమైన పాలన అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజల భాగసామ్యం మరింత పెంచేందుకే ‘మన నగరం’ చేపట్టామని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నివారించేందుకు రాబోయే రోజుల్లో చెత్తతరలింపునకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడతామన్నారు.
పాత వాహనాలను దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులతోపాటు వీధికుక్కలు కూడా లేకుండా చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా తమ నగరం అన్న భావనతో పారిశుధ్య కార్యక్రమాల్లో మరింత భాగస్వాములైతే స్వచ్ఛ నగర కల సాకారమవుతుందని చెప్పారు. ఇప్పటికే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇతర మెట్రోలతో పోల్చితే హైదరాబాద్ మెదటి స్థానంలో నిలిచిందన్నారు. మరోవైపు ప్రజలకు మరింత తాగునీరు అందించేందుకు సరఫరా వ్యవస్థను విస్తరించడం, పాత పైపులైన్ల రిప్లేస్మెంట్, నూతన సరఫరా పనుల ద్వారా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నగరంలో మౌలిక వసతులతోపాటు శాంతి భద్రతలు, కాలుష్య నియంత్రణ వంటి కార్యక్రమాలకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులూ వచ్చాయని, త్వరలోనే దశల వారీగా నగరంలో కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు తరలించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతోపాటు క్లీనర్, గ్రీనర్, సేఫర్ సిటీ లక్ష్యంతో ప్రభుత్వం çపనిచేస్తోందన్నారు. ప్రభుత్వంతో కలిసి వచ్చి, పౌరులుగా పురపాలనలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ‘మన నగరం’ ద్వారా ఇప్పటికే నగరంలో రెండు కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడ దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. నగరంలో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఎస్సార్డీపీ, మూసీ ప్రక్షాళన– అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, పారిశుధ్యం తదితర అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే పలు పనులు పూర్తయి ప్రజలకు ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టకముందు నగరంలో రోజుకు 3500 మెట్రిక్‌టన్నుల చెత్త వెలువడితే, ప్రస్తుతం 4800 మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. తడి– పొడి చెత్త కార్యక్రమం, స్వచ్చ ఆటోల వినియోగం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు.
కూకట్ పల్లి నియోజక వర్గంలోని అపార్ట్ మెంట్ కమిటీలు, రెసిడెన్షియల్ వెల్పేర్ అసోషియేషన్లు, సామాజిక సంస్ధలు, వివిధ రంగాల నిపుణులు, సాదారణ ప్రజలు ఈ సమావేశంలో పలు సమస్యలు, అంశాలపైన మంత్రితో మాట్లాడారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు నగరం విశ్వనగరంగా మారుతున్నదని, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద యెత్తున నగరంలో నడుస్తున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కూకట్ పల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్ధానిక ఎమ్మెల్యే క్రిష్టారావు, ఎంపీ మల్లారెడ్డిలు వివరించారు. ఈ సమావేశాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ నిర్వహించారు. స్దానికంగా ఉన్న పలు సమస్యలను ప్రస్తావించగా మంత్రి అక్కడికక్కడే అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో అధికారులు ఏయే అంశాలను యుద్ధ ప్రాదిపదికన చేపట్టనున్నారో తెలుపుతారని మంత్రి ప్రజలకు హమీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జోనల్, అడిషనల్ కమికషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.