అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలు
⇒ ‘మన ప్రగతి యాత్ర’లో ఎమ్మెల్యే జలగం వెంకటరావు
కొత్తగూడెం : సుపరిపాలన, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. పాల్వంచలో ఏర్పాటు చేసిన సభలో మంగళవారం జలగం మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు.
తొలుత కొత్తగూడెం శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.