పక్కా ప్రణాళికతో సంపద పెంచుకోండి
- ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా ఐటీ మినహాయింపు
- విజయవాడలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ అవగాహన సదస్సులో నిపుణులు
సాక్షి, విజయవాడ: పక్కాగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవటం ద్వారా సురక్షితంగా సంపదను వృద్ధి చేసుకోవచ్చని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎస్ఎల్) బిజినెస్ డెవలప్మెంట్ రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెన్నిశెట్టి సూచించారు. సమగ్ర అధ్యయనంతోపాటు ఆయా కంపెనీల పూర్తి స్థితిగతులు తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టడం మంచిదని చెప్పారు. ఆదివారం విజయవాడలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ నేతృత్వంలో మదుపరులకు అవగాహన సదస్సు జరిగింది.
సదస్సు నిర్వహణకు సీడీఎస్ఎల్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు జత కలిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సాక్షి విజయవాడ ఎడిషన్ యాడ్స్ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్ అధ్యక్షత వహించారు. శివప్రసాద్ మాట్లాడుతూ వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా కంపెనీల వార్షిక నివేదిక, కంపెనీల యాజమాన్యం వివరాలు, ఆయా ఉత్పత్తుల విక్రయాల స్థితిగతులు పరిశీలించాలన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలో లభ్యమవుతుందని, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపు కోసం రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీము లో పెట్టుబడి చేయవచ్చని చెప్పారు. షేర్ల విక్రయాలు జరిపేందుకు పవరాఫ్ అటార్నీ ఇచ్చే ముందు కంపెనీల నియమ నిబంధనలన్నీ పూర్తిగా చదివి సంతకం చేయాలన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు.
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రవికుమార్ ముప్పవరపు మాట్లాడుతూ సరైన కంపెనీలను ఎంచుకొని, సరైన సమయంలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రమోటర్లు షేర్లు కుదవ పెట్టిన కంపెనీల షేర్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాగే ఎక్కువ అప్పులు చూపించే కంపెనీల షేర్లు కూడా కొనుగోలు చేయడం మం చిది కాదని చెప్పారు. సదస్సులో పాల్గొన్న పలువురు మదుపరులు అడిగిన ప్రశ్నలకు హాజరైన నిపుణులు సమాధానాలిచ్చారు.