Mancherial constituency
-
మంచిర్యాల రాజకీయ చరిత్ర : గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
మంచిర్యాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్.దివాకరరావు నాలుగోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత ప్రేమ్ సాగరరావుపై 4877 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో మంచిర్యాల ఏర్పడకముందు రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2014లో ఆయన టిఆర్ఎస్లో చేరి వరసగా మరో రెండుసార్లు గెలుపొందారు. దివాకరరావుకు 75070 ఓట్లు రాగా, ప్రేమ్ సాగరరావుకు 70193 ఓట్లు వచ్చాయి. ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసి ఎర్రబెల్లి రఘునాధరావుకు 4981 ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. మంచిర్యాలలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడుసార్లు టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. భారీ తేడాతో పరాజయం.. మంచిర్యాల నియోజకవర్గంలో 2014 వరకు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ రెడ్డి టిఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్ ఐ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చిన ఎన్. దివాకరరావు విజయం సాధించారు. దివాకరరావు అంతకుముందు ఉన్న లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొంది, తిరిగి మరో రెండుసార్లు మంచిర్యాల నుంచి గెలిచారు. 2014లో దివాకరరావుకు 59,250 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. మంచిర్యాలలో రెడ్డి వర్గానికి చెందిన అరవిందరెడ్డి 2009 సాధారణ ఎన్నికలోను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలోను గెలుపొందారు.2014లో ఓటమిపాలయ్యారు. గతంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఉండేది. అక్కడ ఒకరు చుంచు లక్ష్మయ్య (బిసి) తప్ప మిగిలినవారంతా వెలమ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. రెండుసార్లు గెలిచిన అరవింద్‌రెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత, జడ్.పి.చైర్మన్‌గా రెండుసార్లు, ఓసారి ఎమ్.పి.గా గెలిచిన జి.నరసింహారెడ్డి కుమారుడు. అంతకు ముందు పాత నియోజకవర్గం లక్సెట్టిపేటకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు, జనతాపార్టీ, సోషలిస్టు పార్టీ ఒక్కోసారి గెలవగా ఒక ఇండిపెండెంటు కూడా మరోసారి నెగ్గారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జె.వి. నరసింగరావు ఇక్కడ 1967,72లలో గెలవగా అంతకుముందు 1962లో ఆయన బంధువు జి.వి.పితాంబరరావు చేతిలో ఓడిపోయారు. జె.వి. నరసింగరావు 1957లో బేగంబజార్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. రెండు సార్లు పీతాంబరరావు గెలిస్తే, ఆయన సోదరుడు జి.వి.సుధాకరరావు కూడా మరో రెండుసార్లు విజయం సాధించారు. మరో దళిత నేత రాజమల్లు ఇక్కడ ఒకసారి, సిర్పూరులో మరోసారి, చిన్నూరులో మూడు సార్లు గెలిచారు. జె.వి. నర్సింగరావు గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో సభ్యునిగా ఉండగా, జి.వి.సుధాకరరావు 1978లో శాసనసమండలి సభ్యునిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాలలో, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. రాజమల్లు 1974లో జలగం క్యాబినెట్లో పనిచేసారు. జె.వి. నర్సింగరావు అప్పట్లో కాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాలలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘కోడ్’ను మరిచారు..!
సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సంగతి తెలిసిందే! అయినా, మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో వివిధ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం మరిచారు. పలు ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీలు కూడా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. -
రండి బాబూ చేరండి..!
సాక్షి, మంచిర్యాల: ఒకప్పుడు తెలుగేదేశం పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ప్రస్తుత పరిస్థితి మునిగిన నావలా తయారైంది. తెలంగాణపై చంద్రబాబు వైఖరి నేపథ్యంలో జిల్లాలో సుమారుగా ఆ పార్టీ ఖాళీ అయ్యింది. ఇక.. తాజాగా జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవని తెలిసినా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నివర్గాలనూ ఆకట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటించేసింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు వైద్య పరీక్షలకు రూ.50 వేల వరకు రీయింబర్స్మెంట్, అంగవైకల్యం, పిల్లల వైద్య సంక్షేమ బీమా ప్రయోజనాలు కల్పిస్తామంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారానికి తెరలేపారు. మంచిర్యాలలో ఏకంగా కరపత్రాల పంపిణీ, ఆటోల ద్వారా విసృ్తత ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇది వరకే అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీ సభ్యత్వాలు తీసుకునేందుకు ముందుకురావడం లేదని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పార్టీ సభ్యత్వ ప్రక్రియే దీనికి నిదర్శనమంటున్నారు. మరోపక్క.. పలు ప్రాంతాల ప్రజలు పార్టీలో చే రుతుంటే.. ముందుండి సభ్యత్వం చేయిస్తున్న ఆ పార్టీ మండల, నియోజకవర్గ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ ఆఫర్లు తదుపరి అమలులోకి వస్తాయా అంటూ గుసగుసలాడుతున్నారు. నత్తనడకన సభ్యత్వం..! ఈ నెల మూడో తేదీ నుంచి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల ఐదో తేదీ వరకు కొన సాగించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ సభ్యత్వ నమోదును ఆన్లైన్ చేసే బాధ్యతను ‘ఐటీ గ్రిడ్’ అనే సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించింది. ఈ సాఫ్ట్వేర్ సంస్థ.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువకులకు శిక్షణ ఇచ్చి మండలానికొకరి చొప్పున జిల్లాకు పంపింది. ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 4 వేల సభ్యత్వ నమోదు టార్గెట్ పెట్టగా.. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనూ రెండు వేలు దాటలేదు. మంచిర్యాల నియోజకవర్గంలో రెండు వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఎన్నికల ముందు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యం 50 వేలపైనే ఉండేది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈసారి కేవలం 25 వే లే చాల నుకున్నారు. అయినా.. 26 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది మాత్రమే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు గడువు ఇంకా పెంచాలని పార్టీ నాయకులు అధిష్టానాన్ని కోరారు. దీంతో అధిష్టానమూ వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచే ఆలోచనలో ఉందని మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి సత్యం చెప్పారు. -
రెండో పంట ఇక కల్లే..!
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కడెం ప్రాజెక్టు నుంచి కాలువలను ఏర్పాటు చేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మూడు మండలాల్లోని పంట పొలాలకు కడెం నీరు అందాల్సి ఉన్నా, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో, చివరి వరకు నీరు అందడం లేదు. మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల గ్రామాల వరకు కడెం కాలువ ఉన్నా, నీరు రాకపోవడంతో ఆ కాలువలు కబ్జాకు గురై చుక్క నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రూ. 33 కోట్లతో మండలంలోని ముల్కల్ల గ్రామంలో ర్యాలీ వాగు ప్రాజెక్టును 2009, ఫిబ్రవరి 23న అప్పటి దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి మట్టం 151.5 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 151.1 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి సాగునీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువలను తవ్వి, సిమెంటు లైనింగ్ చేయకపోవడంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, నాచు పెరిగిపోయి నీరు పారడం లేదు. కాలువలు తెగిపోయి, నీరు వృథాగ పోతుండడంతో, ప్రాజెక్టు నీటిని సరఫరా చేయడం లేదు. కాలువల మరమ్మతు లేక ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన 3 వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందకుండా పోయింది. ఇటీవల ర్యాలీవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి బడ్జెట్లో కోటి రూపాయలను కేటాయించడంతో, అవి పూర్తిస్థాయిలో సరిపోవని రైతులు అంటున్నారు. ముందుగా కాలువలను ఆధునికీకరించి, పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే వచ్చే రబీకి కూడా సాగునీరు అందకుండా పోతుందని, ప్రాజెక్టు నిండా నీరున్నా నిష్ర్పయోజనమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ఆయకట్టు 6 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం సాగయ్యేది 3 వేల ఎకరాలే. గడ్డెన్నవాగు ప్రాజెక్టు భైంసా : 2008లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 14 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులు ప్రణాళికలు వేసి ప్రాజెక్టును నిర్మించారు. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 357.6 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 356.5 మీటర్లుగా ఉంది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 355.0 మీటర్ల మేర నీటి నిల్వ ఉంచుతారు. ప్రస్తుతం 1.6 మీటర్ల నీటి మట్టం పెరిగి ఉంది. ప్రస్తుతం కాలువల నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడు కూడా ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు నీరు అందదు. స్వర్ణ ప్రాజెక్టు సారంగాపూర్ : నిర్మల్, సారంగాపూర్ మండలాల ప్రజల వరప్రదాయిని అయిన స్వర్ణ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గతంలో 1180 వరకు ఉన్న నీటిమట్టం ఐదు అడుగుల వరకు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1175 అడుగులకు చేరుకుంది. రబీ సాగుకు తైబందు విధించి కేవలం మధ్య కాలువ ద్వారా రబీ సాగుకు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపర్చలేదు. వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టును 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.100 కోట్లతో నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లోని 24,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. అంటే లక్ష్యం ప్రకారం చూస్తే కనీసం పది శాతం కూడా నీరందించడం లేదన్నమాట. కాగా, ఈ ఏడాది రూ.35 లక్షలతో కాల్వల మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 239.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.8 మీటర్ల నీరు నిల్వ ఉంది. కొమురంభీమ్ ప్రాజెక్టు ఆసిఫాబాద్ : మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450 కోట్లతో నిర్మిస్తున్న కొమురంభీమ్ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. కాల్వల ద్వారా ఈ ఏడాది కూడా సాగునీరందే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరున్నా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో సాగు నీరదంని దుస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల ద్వారా 45,600 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా, అటవీ శాఖ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 239.5 మీటర్లు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు సమీపంలోని వాంకిడి మండలానికి చెందిన కొంతమంది రైతులు మోటార్లతో నీటిని పంట పొలాలకు అందిస్తున్నారు.