mandala parishath office
-
మొయినాబాద్ ఎంపీఓపై వేటు
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఉషాకిరణ్పై వేటు పడింది. ఆమె గతంలో పనిచేసిన చోట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఇంచార్జి కలెక్టర్ హరీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందడానికి ముందు ఉషాకిరణ్.. ఇబ్రహీంపట్నం మండలం పోచారం పంచాయతీ సెక్రటరీగా 2018–19లో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో పంచాయతీ పరిధిలో పన్నుల రూపంలో వసూలైన రూ.7.72 లక్షలను ప్రభుత్వ ఖజానాలో జమచేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన ఇంచార్జి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. అసలు కారణం ఇదేనా..? మొయినాబాద్లో మండల పంచాయతీ అధికారిగా తన బాధ్యతలను విస్మరించి అనధికార వెంచర్ల యాజమానులకు సహకరించారనే ఆరోపణలు సైతం ఉషాకిరణ్పై వెల్లువెత్తాయి. అనుమతి లేని వెంచర్ల ఏర్పాటుపై చూసీచూడనట్లు వ్యవహరించేందుకు యజమానుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల పేర్లను, హోదాను కూడా ఆమె వాడుకున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజులుగా మొయినాబాద్ మండల పరిధిలో అనధికార లేఅవుట్లను అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ఆరోపణలు, అనధికార వెంచర్ల ఏర్పాటులో తన పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ విషయం యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో ఆమె తొలుత పనిచేసిన చోటు నుంచి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోచారంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో ఆ వెంటనే సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘నిద్రపోను.. నిద్రపోనివ్వను’
మంగళగిరి: గత ఐదేళ్లలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిథులకు ఏమాత్రం సహకరించలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తన విషయంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. ఆదివారం మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో ఆళ్లరామక్రిష్ణారెడ్డి అధికారులతో మాట్లాడారు. అధికారులపై ఒత్తిడి తెస్తే మానసికంగా ఇబ్బంది పడతారేమోనని అప్పట్లో వదిలేశానని చెప్పారు. భగవంతుడు, ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సమావేశాలకు ఇకపై అన్నిశాఖల అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. అధికారులు తప్పుడు సమాచారం చెబితే నమ్మే అంత పిచ్చి వాడినైతే తాను కాదన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గత ఐదేళ్లలో ప్రజా ధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ అధికారులు తమ ఉద్యోగాలకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకోవద్దు.. ఒకవేళ ప్రజలు ఇచ్చినా దయచేసి తీసుకోవద్దని అధికారులకు సూచించారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. -
చెప్పులతో కొట్టుకున్నారు..
బాలాయపల్లి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తెలుగు తమ్ముళ్లు చెప్పులతో కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జార్లపాడు గ్రామానికి చెందిన రవి, పిగిలాం గ్రామానికి చెందిన ఎం. ప్రసాద్ ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును దుర్భాషలాడారు. దీంతో అక్కడే ఉన్న కామకూరుకు చెందిన నాగయ్య అలా అనడం సరికాదని అడ్డుతగిలారు. అంతే ప్రసాద్, రవి నాగయ్యను పట్టుకుని చొక్కా చింపేశారు. దీంతో ఒక్కసారిగా నాగయ్య తన చెప్పు తీసుకుని వారి విచక్షణా రహితంగా బూతులు తిడుతూ.. దాడికి పాల్ప డ్డాడు. వీరి గొడవతో పక్కనే ఉన్న స్త్రీ శక్తి భవనంలోని మహిళలు భయపడి రోడ్డుపైకి పరుగులు తీశారు. పక్కనే ఉన్న సీనియర్ టీడీపీ నాయకుడు కూను రామయ్య వారిని అడ్డుకుని సర్ది చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసింది. తాగి అధికారులను తిట్టడం వారికి మామూలే! తరచూ తెలుగు తమ్ముళ్లు తాగి.. తాము చెప్పింది చేయాలనే ఉద్దేశంతో అధికారులను తిట్టడం పరిపాటిగా మారిందని పలువురు అంటున్నారు. తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో వారు రెచ్చిపోతున్నట్లు తెలిసింది.