మానేరు రివర్ ఫ్రంట్‌కు సర్వే
కరీంనగర్ కార్పొరేషన్: ఉత్తర తెలంగాణకే మణిహారంగా మధ్య మానేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక్కడ మానేరు రివర్ ఫ్రంట్ పనులకు సర్వే చేపడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి టాటా కన్సల్టెన్సీకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం మానేరు డ్యాం, నదీ తీరంలో పర్యటించింది. మానేరు డ్యాంలో నీటి లభ్యత, మానేరు వాగు వైశాల్యం, చెక్‌డ్యాం నిర్మాణం, ఐటీ టవర్స్ నిర్మాణానికి స్థలం, సైక్లింగ్‌ట్రాక్, థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సర్వే చేపట్టారు. గూగుల్ మ్యాప్‌తో వచ్చిన సదరు బృందం సభ్యులు ప్రతిపాదిత రివర్ ఫ్రంట్‌కు సంబంధించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
మరోమారు 20 మంది సభ్యుల బృందంతో వచ్చే రెండు నెలల్లో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), రివర్ ఫ్రంట్ డిజైన్ తయారు చేసి ఇస్తామని వెల్లడించారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి నివేదించి, అప్రూవల్ తీసుకోవడంతో పాటు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ... రూ.506 కోట్లతో కరీంనగర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్తర తెలంగాణకే మణిహారంగా రివర్ ఫ్రంట్ ఉంటుందని, రెండేళ్లలో పనులుపూర్తి చేసి కరీంనగర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు.