ఖైదీల మధ్య ఘర్షణ: ఇద్దరి మృతి
కర్ణాటకలోని మంగళూరు జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు, మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న మదూర్ ఇసుబు అనే ప్రమాదకరమైన ఖైదీతో పాటు, అతడి అనుచరుడైన గణేశ్ శెట్టి అనే అండర్‌ట్రయల్ ఖైదీ కూడా ఈ ఘర్షణలో మరణించాడు. తీవ్రంగా గాయపడిన 12 మంది ఖైదీలను వెన్లాక్ ఆస్పత్రికి తరలించారు.
జైల్లోని రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది గానీ, దానికి కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియలేదు. ఖైదీలందరూ ఉదయం టిఫిన్ చేయడానికి ఒకచోట చేరినప్పుడు ఈ ఘర్షణ మొదలైంది. ఇది కేవలం రెండు గ్యాంగుల మధ్య ఘర్షణే తప్ప వర్గపోరు కాదని పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ చెప్పారు. ఖైదీలకు సంబంధించిన వాళ్లు ఎవరో జైలు బయటనుంచి గోడ మీదుగా ఆయుధాలను లోపలకు విసిరి ఉంటారని, వాటితోనే వీళ్లు ఘర్షణ పడ్డారని తెలిపారు.
ఈ ఘర్షణలో మరణించిన ఇసుబును 2010లో ఇంటర్‌పోల్ వర్గాలు రియాద్‌లో అరెస్టుచేసి మంగళూరుకు తీసుకొచ్చారు. అప్పటినుంచి అతడు ఈ జైల్లోనే ఉన్నాడు. అప్పట్లో బీజేపీ నాయకుడు సుఖానంద శెట్టి హత్య సహా పలు హత్యకేసుల్లో ఇసుబు నిందితుడు. ఇక 1994 నాటి మహేంద్రప్రతాప్ హత్యకేసులో నిందితుడైన షార్ప్ షూటర్ గణేశ్ శెట్టిని కూడా 2010లోనే అరెస్టు చేసి మంగళూరు జైలుకు తరలించారు.